
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌లో రోజూ ఐదారుమంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెడుతున్నాయని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం ప్రకటించారు. ఉగ్రవాదాన్ని అణిచేందుకు ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుందని ఆయన అన్నారు. భద్రతా బలగాలు కూడా అద్భుతంగా పని చేస్తుండడంతో ఉగ్రవాదులు కశ్మీర్‌లో అడుగుపెట్టేందుకు భయపడుతున్నాయని ఆయన చెప్పారు. న్యూఢిల్లీలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) నూతన భవనాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన.. పారామిలటరీ, ఆర్మీ, ఇతర భద్రతా బలగాలు కశ్మీర్‌లో రోజూ ఐదారుమంది ఉగ్రవాదులను హతమారుస్తున్నాయని చెప్పారు.
ఇదిలా ఉండగా.. 2009 నుంచి ఇప్పటివరకూ ఎన్‌ఐఏ విచారణకు 166 కేసులు అప్పగించారని.. అందులో 88 కేసులు ఉగ్రవాద ఘటనలకు సంబంధించనవేనని చెప్పారు. ఉగ్రవాద కేసులను విచారించడంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అద్భుతంగా పనిచేస్తోందని రాజ్‌నాథ్ తెలిపారు.