టీ మంత్రులు,ఎంపీలపై దిగ్విజయ్‌కు సీమాంధ్ర ఎంపీల లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్‌ఎస్ సహా కొన్ని రాడికల్, వేర్పాటువాద సంస్థలకు వత్తాసు పలికేలా తెలంగాణ మంత్రులు, టీ కాంగ్రెస్ ఎంపీలు ప్రవర్తిస్తున్నారని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌కు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లో ఏపీఎన్జీవోలు తలపెట్టిన సభను అడ్డుకుంటామని వేర్పాటువాద శక్తులు ప్రకటనలు చేస్తే దానికి టీ కాంగ్రెస్ నేతలు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. సమైక్యంలోనే వివిధ ప్రాంతాలవారి హక్కుల రక్షణకు నాయకులు అండగా నిలవకపోతే.. విడిపోయినపక్షంలో సామాన్య ప్రజల దుస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చుఅని పేర్కొన్నారు.
ఈ మేరకు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు శుక్రవారం దిగ్విజయ్‌కు లేఖ రాశారు. దీనిపై ఎంపీలు ఉండవల్లి అరుణకుమార్, సాయిప్రతాప్, లగడపాటి రాజగోపాల్, అనంతవెంకట్రామిరెడ్డి, కేవీపీ రామచంద్రరావు సంతకాలు చేశారు. ప్రాంతాలమధ్య వైషమ్యాలు పెంచడంలో తెలంగాణ నాయకులు పోటీపడుతున్నారని ఆరోపించారు. గతంలోనే జాగో భాగో అంటూ టీఆర్‌ఎస్ నినాదమిచ్చినా దాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలెవరూ ఖండించకపోవడాన్ని దిగ్విజయ్‌కు వారు గుర్తుచేశారు. కులం, మతం, ప్రాంతం, భాషల ప్రాతిపదికన విభజన రాజకీయాలు చేయడానికి వ్యతిరేకమైన జాతీయ పార్టీలో సభ్యులుగా ఉన్న నాయకులే భారత రాజ్యాంగం కల్పిస్తున్న భావవ్యక్తీకరణ స్వేచ్ఛను అడ్డుకోవడం గర్హనీయమన్నారు. ఇప్పటికైనా వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన్ను కోరారు.