కిల్లర్ బాబా ఎట్టకేలకు అరెస్ట్
వరుసగా దొంగ బాబాల ఉదంతాలు బయటపడుతున్న నేపథ్యంలో వారిని నమ్మొద్దంటూ...
సాక్షి, న్యూఢిల్లీ: చిన్నతనంలోనే ఇంటి నుంచి పారిపోయి ఢిల్లీకి చేరుకున్న అతగాడు ఆధ్యాత్మిక చింతనలోకి ఒదిగిపోయాడు. చివరకు బాబా అవతారం ఎత్తాలని నిర్ణయించుకున్నాడు. స్వామి ప్రతిభానంద్‌గా పేరు మార్చుకుని ముందుగా భక్తులను సంపాదించుకుని.. మెల్లిగా ఓ ఆశ్రమం ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు. అయితే అది డబ్బుతో కూడుకున్న వ్యవహారం కావటంతో కాంట్రాక్ట్ కిల్లర్ అవతారం ఎత్తాడు.
ప్రముఖ వ్యాపారవేత్త, బీఎస్పీ నేత దీపక్ భరద్వాజ్ హత్యలో ప్రధాన నిందితుడు, బాబా ప్రతిభానంద్‌ను ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఘజియాబాద్‌లో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. 2009 ఎన్నికల్లో పోటీ చేసిన దీపక్ అప్పటి అభ్యర్థుల జాబితాలో అత్యంత ధనికుడిగా నిలిచారు. దీంతో దీపక్ మీద కన్నేసిన బాబా ప్రతిభానంద్ 5 కోట్లను డిమాండ్ చేశాడు. అందులో 2 కోట్లతో హరిద్వార్‌లో ఆశ్రమం నిర్మించుకోవాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. అయితే అందుకు అంగీకరించకపోవటంతో దీపక్‌ను చంపాలని నిర్ణయించుకున్నాడు.
రెండుసార్లు విఫలం అయ్యాక చివరకు 2013లో దీపక్‌ను మట్టుపెట్టగలిగాడు. అనంతరం ప్రతిభానంద్ పరారీలో ఉండగా, ఢిల్లీ పోలీసులు అతని కోసం తీవ్రంగా గాలిస్తూనే వస్తున్నారు. ఈ కేసులో ప్రతిభానంద్‌పై లక్ష రివార్డు కూడా పోలీస్ శాఖ ప్రకటించింది. చివరకు ఘజియాబాద్ స్టేషన్ జంక్షన్‌లో సంచరిస్తున్నాడన్న సమాచారం అందుకున్న పోలీసులు చివరకు అతన్ని అరెస్ట్ చేశారు. అతని నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆయుధాల చట్టం ప్రకారం మరో కేసు నమోదు చేశారు. కాగా, ప్రోఫెషనల్ షూటర్లతో దీపక్‌ను బాబా హత్య చేయించినట్లు ఎస్పీ ఆకాశ్ తోమర్ చెబుతున్నారు.