ఛండీఘర్: అసభ్య సందేశాలు, యువతుల అశ్లీల చిత్రాలను పంపడం.. ఇంటర్నెట్‌లో పోస్ట్ చేయడం మహిళల గౌరవానికి భంగం కగిలించడంతో సమానమని పంజాబ్, హర్యానా హైకోర్టు అభిప్రాయపడింది. ఈ తరహా ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని.. సమాజానికి వినాశ హేతువులుగా మారుతున్న ఈ తరహా ఘటనలను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పింది. అమత్‌సర్‌కు చెందిన ఆదర్శ సింగ్ అనే వ్యక్తి ఓ యువతికి అసభ్యకరమైన సందేశాలు, చిత్రాలు పంపడమేకాక, ఆమె అభ్యంతరకర చిత్రాలను ఇంటర్‌నెట్‌లో పెడతానని బ్లాక్‌మెయిల్ చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఆదర్శ్‌సింగ్‌తో పాటు మరో వ్యక్తిపై అమత్‌సర్ పోలీసులు గత ఏడాది ఏప్రిల్ 24న కేసు నమోదు చేశారు.
వీరిపై మహిళల గౌరవాన్ని భంగం కలిగించడంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో ఆదర్శ్ సింగ్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ మహీంధర్‌సింగ్‌సుల్లార్ పై విధంగా వ్యాఖ్యానిస్తూ.. ఆదర్శ్‌సింగ్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించారు. ఈ సందర్భంగా ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాదులు ఆదర్శ్‌సింగ్ పంపిన అసభ్య సందేశాలు, అశ్లీల చిత్రాల తాలుకూ ప్రతులను కోర్టుకు సమర్పించారు. బాధితురాలి వివాహాన్ని చెడగొట్టాలనే ఉద్దేశంతో.. ఆ యువతికి, ఆమె బంధువులకూ ఆదర్శ్ సింగ్ అసభ్యకరమైన సందేశాలు, అశ్లీల చిత్రాలను పంపినట్టు ప్రాసిక్యూషన్ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. వీటిని పరిశీలించిన న్యాయమూర్తి ఆదర్శ్‌సింగ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చారు.