నిఘా రాజ్యంగా మారుస్తారా? | Setting up of social media hub is like creating surveillance state | Sakshi
Sakshi News home page

నిఘా రాజ్యంగా మారుస్తారా?

Published Sat, Jul 14 2018 3:00 AM | Last Updated on Mon, Oct 22 2018 6:13 PM

Setting up of social media hub is like creating surveillance state - Sakshi

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ డేటాపై నిఘా పెట్టేందుకు సోషల్‌ మీడియా హబ్‌ను ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘పౌరులందరి కదలికలు, సంబంధాలపై పూర్తి నిఘా ఉండే రాజ్యంలా దేశాన్ని మార్చాలనుకుంటున్నారా?’ అంటూ కేంద్రానికి కోర్టు మొట్టికాయలు వేసింది.

ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సాప్‌ తదితర అన్ని సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్ట్‌లు, సందేశాలతోపాటు వార్తా వెబ్‌సైట్‌లు, బ్లాగులలో ప్రచురితమయ్యే కథనాలను సేకరించి, విశ్లేషించేందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ యంత్రాంగం ఏర్పాటు కోసం ఈ ఏడాది మే నెలలో కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ టెండర్‌ పిలిచింది. బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (బీఈసీఐఎల్‌) అనే ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా ఈ టెండర్‌ జారీ అయ్యింది. కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాన్ని అడ్డుకోవాలంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ శాసనసభ్యురాలు మహువా మొయిత్రా ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయడంతో విషయం సుప్రీం కోర్టుకు చేరింది.

రెండు వారాల్లో స్పందించండి..
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మిశ్రా నేతృత్వంలోని బెంచ్‌ శుక్రవారం మహువా పిటిషన్‌ను విచారించింది. దీనిపై 2 వారాల్లో స్పందించాలంటూ కేంద్రానికి నోటీసు జారీ చేసింది. పిటిషన్‌ విచారణలో అటార్నీ జనరల్‌ వేణుగోపాల్‌ లేదా ఎవరో ఒక న్యాయాధికారి తమకు సాయంగా ఉండాలని ఆదేశించింది. మహువా తరఫున న్యాయవాది ఏఎం సింఘ్వీ వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం సోషల్‌ మీడియా హబ్‌ ద్వారా సామాజిక మాధ్యమాల్లో, ఈ–మెయిల్స్‌లో వచ్చే పోస్ట్‌లు, సందేశాలను విశ్లేషించాలనుకుంటోందని కోర్టుకు చెప్పారు.

పౌరుల ప్రాథమిక హక్కయిన గోప్యతా హక్కును కాలరాయాలని ప్రభుత్వం చూస్తోందని, రాజ్యాంగంలోని అధికరణాలు 14, 19(1)(ఎ), 21ల ద్వారా పౌరులకు సంక్రమించిన ప్రాథమిక హక్కులకు భంగంకలిగేవీలుందని వాదించారు. టెండర్‌ను ప్రభుత్వం ఆగస్టు 20న తెరవనున్నట్లు ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో అంతకంటే ముందే, ఆగస్టు 3కు విచారణను ధర్మాసనం వాయిదా వేసింది. సోషల్‌ మీడియా హబ్‌ ఏర్పాటు చేయకుండా కేంద్రాన్ని అడ్డుకునేందుకు జూన్‌ 18నే అత్యవసర విచారణ జరపాల్సిందిగా మహువా కోరినా అప్పట్లో కోర్టు నిరాకరించింది. ఏ అధికారం లేకుండానే ప్రభుత్వం ప్రజల జీవితాల్లోకి చొరబడాలనుకుంటోందనీ, భావ ప్రకటనా స్వేచ్ఛా హక్కు సహా పలు ప్రాథమిక హక్కులకు దీని ద్వారా భంగం కలుగుతుందని మహువా పిటిషన్‌లో పేర్కొన్నారు.

టెండర్‌లో ఏముంది?
టెండర్‌లో తాము కోరుకుంటున్న సాఫ్ట్‌వేర్‌ యంత్రాంగం ఎలా ఉండాలో కేంద్రం వివరించింది. సామాజిక మాధ్యమాలతోపాటు, వార్తల వెబ్‌సైట్లు, బ్లాగులు తదితరాల్లోని డిజిటల్‌ సమాచారాన్నంతా ప్రాంతాల వారీగా దేశ వ్యాప్తంగా సేకరించి, ఆటోమేటిక్‌గా విశ్లేషించగలిగేలా సాఫ్ట్‌వేర్‌ ఉండాలి. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పరిణామాలను తెలుసుకునేందుకు ఒక్కో జిల్లాలో కొంతమంది మీడియా వారిని ఒప్పంద ప్రాతిపదికన నియమించుకుంటారు. ఆటోమేటిక్‌గా సమాచారాన్ని వ్యూహాత్మకంగా విశ్లేషించి నివేదికలు ఇచ్చేలా సాఫ్ట్‌వేర్‌ ఉండాలి.  ప్రత్యేకించిన వెబ్‌సైట్‌లో సమాచారాన్ని ప్రచురించగలగాలి. కేంద్రం చేపట్టే వివిధ పథకాల ఆన్‌లైన్‌ ప్రచార కార్యక్రమాల ప్రభావం ప్రజలపై ఎలా ఉందో తెలుసుకునేందుకు కూడా అవకాశం ఉండాలని టెండర్‌లో ప్రభుత్వం పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement