చెన్నూర్/కాళేశ్వరం(మంథని) : మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మహిళలు సహా ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. సిరోంచ తహశీల్‌లోని జింగనూర్ ఔట్‌పోస్టుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కల్లెడ అనే గ్రామంలోని అడవుల్లో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. పక్కా సమాచారంతో మహారాష్ట్ర నక్సల్ వ్యతిరేక పోలీసులను ఈ ఆపరేషన్‌కు పంపినట్లు స్పెషల్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (యాంటీ నక్సల్ ఆపరేషన్స్) శరద్ షేలార్ తెలిపారు. కోబ్రా బెటాలియన్ సీ–60 కమాండో జాయింట్ ఆపరేషన్ ఎస్పీ మోతీరాం అధ్వర్యంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసు వర్గాలు తెలిపాయి.
మృతులు గడ్చిరోలి, ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారే!
పీపుల్స్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) వారోత్సవాల సందర్భంగా కల్లెడ గ్రామంలో మావోయిస్టులు సమావేశం అవుతున్నారనే సమాచారంతో పోలీసులు అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. పోలీసుల రాకను గమనించిన మావోయిస్టులు కాల్పులు జరపగా, ఎదురుకాల్పులు జరిగినట్లు అధికారులు చెప్పారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారని, వారి నుంచి నాలుగు రైఫిళ్లు, రెండు తుపాకులు, ఒక నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మృతులంతా గడ్చిరోలి జిల్లా అహేరి, చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన వారని అనుమానిస్తున్నారు. అందులో ఆరుగురిని చందు, అయంత్, సునీత, అనిత, అఖిల, శీలగా గుర్తించినట్లు సమాచారం. ఇంకా వారి పూర్తి వివరాలు వెల్లడికాలేదు.
Comments
Please login to add a commentAdd a comment