
రాజ్యసభ నేతగా శరద్ యాదవ్ తొలగింపు
న్యూఢిల్లీ: బిహార్‌లో బీజేపీతో కలవడాన్ని వ్యతిరేకించడంతో జేడీయూ సీనియర్ నేత శరద్ యాదవ్‌ను రాజ్యసభలో పార్టీ నాయకుడి పదవి నుంచి తప్పించారు. మరో నాయకుడు ఆర్సీపీ సింగ్‌ను రాజ్యసభలో తమ నాయకుడిగా జేడీయూ సభ్యులు ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని జేడీయూ ఎంపీలు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకి శనివారం అధికారికంగా తెలియజేశారు.
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు ఆర్సీపీ సింగ్ విశ్వాసపాత్రుడు. జేడీయూకు రాజ్యసభలో 10 మంది ఎంపీలుండగా, కాంగ్రెస్ ఏర్పాటు చేసిన విపక్షాల సమావేశానికి హాజరైనందుకుగాను అలీ అన్వర్ అన్సారీ అనే ఎంపీని శుక్రవారం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరోవైపు కేంద్రంలోని ఎన్డీయేలో చేరి మంత్రి పదవి చేపట్టాల్సిందిగా జేడీయూను ఆహ్వానించినట్లు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా చెప్పారు. నితీశ్‌ను తన నివాసంలో శుక్రవారం కలిసినట్లు షా శనివారం ఓ ట్వీట్‌లో తెలిపారు.