సాక్షి, న్యూఢిల్లీ : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే దేశంలోని అత్యంత పేద కుటుంబాలకు ఏటా రూ 72,000 అందిస్తామని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రకటించిన కనీస ఆదాయ హామీ పధకంపై బీజేపీ అసంతృప్త నేత శత్రుఘ్న సిన్హా ప్రశంసలు కురిపించారు. పరిస్థితులకు అనుగుణంగా రాహుల్ ప్రకటించిన ఈ పధకాన్ని పేదరికంపై మాస్టర్‌స్ర్టోక్‌గా ఆయన అభివర్ణించారు.
రాహుల్ ప్రకటించిన కనీస ఆదాయ హామీ పధకంతో భీతిల్లిన కొందర మన దిగ్గజ నేతలు ఈ పధకాన్ని విమర్శించేందుకు హుటాహుటిన విలేకరుల సమావేశం నిర్వహించారని అరుణ్ జైట్లీని ఉద్దేశించి శత్రుఘ్న సిన్హా ట్వీట్ చేశారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ సహా, పాలక బీజేపీ విధానాలను గత కొన్నేళ్లుగా శత్రుఘ్న సిన్హా బాహాటంగా ఎండగడుతున్న సంగతి తెలిసిందే.
మరోవైపు రాహుల్ ప్రకటించిన కనీస ఆదాయ హామీ పధకాన్ని బీజేపీ తోసిపుచ్చింది. ఈ పధకం ఆర్భాటమేనని పేదరికాన్ని తొలగించే దిశగా కాంగ్రెస్ ఎన్నడూ చర్యలు చేపట్టలేదని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ విమర్శించారు. కాగా పార్టీ విధానాలను బహిరంగంగా విమర్శిస్తున్న శత్రుఘ్న సిన్హాకు బీజేపీ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పట్నా సాహిబ్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేరును అభ్యర్ధుల జాబితాలో పొందుపరిచింది.
తనకు టికెట్ నిరాకరించిన బీజేపీ నాయకత్వానికి తానూ అదేస్ధాయిలో బదులిస్తానని సిన్హా స్పందించారు. అద్వానీకి గాంధీనగర్ నుంచి తిరిగి పోటీ చేసే అవకాశం కల్పించకపోవడం పట్లా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దిగ్గజ నేతను రాజకీయాల నుంచి వైదొలిగేలా పార్టీ అగ్రనాయకత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కాగా, శత్రుఘ్న సిన్హా ఈనెల 28న కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment