
న్యూఢిల్లీ: బీజేపీని వీడుతున్నట్లు ప్రకటించిన సినీనటుడు, రాజకీయనేత శతృఘ్న సిన్హా కాంగ్రెస్‌లో చేరడంపై వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ జాతీయ పార్టీగా వాస్తవ దృక్పథాన్ని కలిగి ఉన్నందునే తమ కుటుంబ సన్నిహితుడు లాలూ ప్రసాద్ సూచన మేరకు ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలు తమ పార్టీలో చేరాలని కోరినప్పటికీ తాను లోక్‌సభ ఎన్నికల్లో పట్నా సాహిబ్ నుంచి పోటీ చేయాలనే కాంగ్రెస్‌లో చేరినట్లు చెప్పారు. సుదీర్ఘకాలంగా బీజేపీలో ఉన్న తనకు పార్టీని వీడటం కష్టంగానే ఉందని, కానీ ఎల్.కె.అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, అరుణ్ శౌరి, యశ్వంత్ సిన్హా వంటి అగ్ర నేతలకు పార్టీ తగిన గౌరవం కల్పించకపోవడంతో కలత చెందానని పీటీఐ వార్తా సంస్థకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చారు.
ఇక 2014లో పట్నా సాహిబ్ నియోజక వర్గం నుంచి బీజేపీ మద్దతు లేకుండా తన సొంత అర్హత ఆధారంగానే గెలుపొందానని, ఈసారి కూడా గత రికార్డులను బద్దలుకొట్టి ఘనవిజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీలో ప్రజాస్వామ్యం లేదని, ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో నియంతృత్వ పోకడలున్నాయని దుయ్యబట్టారు. వాజ్‌పేయి హయాంలో పార్టీలో ఉమ్మడి నిర్ణయాలు తీసుకునే పద్ధతి ఉండేదని, కానీ ఇప్పుడు వన్ మ్యాన్ షో, టూ మెన్ ఆర్మీ పరిస్థితి నెలకొందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తను కాంగ్రెస్‌లో చేరడానికి పలు కారణాలున్నాయని, గాంధీజీ, పటేల్, నెహ్రూ, వంటి గొప్ప నాయకులున్న పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. అలాగే స్వాతంత్య్రోద్యమ సమయంలో కాంగ్రెస్ ఎంతో కృషి చేసిందని కొనియాడారు. పట్నా సాహిబ్ నియోజక వర్గం నుంచి తన ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి రవిశంకర్ ప్రసాద్‌పై స్పందిస్తూ ‘రవి శంకర్‌కు నా శుభాకాంక్షలు. గెలుపును పట్నా ప్రజలే నిర్ణయిస్తారు. ఆ దేవుడి దయ, ప్రజల మద్దతుతో గెలుస్తాననే నమ్మకం నాకుంది’ అని చెప్పారు.