
డబ్బులిచ్చి.. చెంపదెబ్బలు తిన్నాడు..
నవ్వుతూ చెంప వాయించేందుకు చేయి లేపిన ఈ అమ్మాయి ఉద్యోగి. అతను బాస్. అవును.. ఫేస్‌బుక్ ఓపెన్ చేసినప్పుడల్లా చెంపదెబ్బ కొట్టేందుకే ఆమెను ఉద్యోగంలో పెట్టుకున్నాడు మనీశ్ సేథీ అనే ఈ భారతీయ అమెరికన్. కొన్నాళ్లు చెంపదెబ్బలు తిన్నతర్వాత ఈయన ఫేస్‌బుక్‌ను అతిగావాడే అలవాటును మానుకున్నాడట కూడా. రెండేళ్ల క్రితం ఈ సంగతి తెలిసి ఇంటర్నెట్‌లో ఈయన తెగ పాపులర్ కూడా అయిపోయారు. అయితే మనుషులకు కాస్త హెచ్చరికగా కొట్టడం లేదా షాక్‌లివ్వడం చేస్తే కొన్నాళ్లకు అలవాట్లను మార్చుకుంటారని సేథీ అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడట. అందుకే.. ఇప్పుడు షాక్‌లిస్తూ మనుషుల్ని దారిలోపెట్టే సరికొత్త రిస్ట్‌బ్యాండ్‌ను తయారుచేశారు.
పొద్దున్నే వాకింగ్‌కు వెళ్లాలనుకుని.. తీరా అలారం మోగేసరికి దాని బటన్ నొక్కేసి ముసుగుతన్నేసే వారిని ‘పావ్‌లోక్’ అనే ఈ రిస్ట్‌బ్యాండ్ షాక్‌లిచ్చి మరీ నిద్రలేపుతుందట. తొలుత రెండుసార్లు వైబ్రేషన్లు ఇచ్చిన తర్వాత ఇది షాక్ కొడుతుందట. బద్దకిస్టులు, ఫేస్‌బుక్, ఇతర సైట్లను ఎక్కువగా చూసేవారు దీనిని ధరిస్తే షాక్‌లిస్తూ దారికి తెస్తుందట. వివిధ అలవాట్లు, ఇతర సమాచారాన్ని మొబైల్ యాప్‌లో నిక్షిప్తంచేస్తే.. దానికి అనుగుణంగా ఈ బ్రేస్‌లెట్ పనిచేస్తుందంటున్నారు. సుమారు రూ.15 వేల ఖరీదైన ఈ చేతిపట్టీ వచ్చే ఏడాది మార్కెట్లోకి రానుంది.