ముంబై: ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్‌లో ఇటీవల జరిగిన ఘటనను మతపరమైన విషయంగా మార్చవద్దని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే హితవు పలికారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘ అది చాలా సున్నితమైన విషయం.. ఒక ఎంపీ, క్యాంటిన్ సిబ్బంది మధ్య జరిగిన చిన్న విషయానికి మతం రంగు పులుముతున్నారు.. అది కరెక్టు కాదు..’ అని వ్యాఖ్యానించారు.
తమ పార్టీ హిందూత్వ ఎజెండాగా పనిచేసే మాట నిజమే అయినా అన్య మతాలవారిని సమానదృష్టితో చూస్తుందని ఆయన నొక్కిచెప్పారు. దీన్ని ఒక సాధారణ విషయంగా పరిగణించాలి తప్ప మతం రంగు పూయొద్దని హితవు పలికారు. ఈ నెల 17వ తేదీన ఠాణేకు చెందిన శివసేన ఎంపీ రాజన్ విచారే మహారాష్ట్ర సదన్‌కు వెళ్లారు. ఆయనకు అక్కడ పెట్టిన భోజనం నాణ్యత నచ్చలేదు. దాంతో తనకు భోజనం వడ్డించిన సదన్ సిబ్బంది అషరఫ్ జుబైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోటీని బలవంతంగా అతడి నోటిలో కుక్కాడు. కాగా, రంజాన్ ఉపవాసంలో ఉన్న జుబైర్‌కు దీక్ష భగ్నమైంది.
ఈ విషయం బుధవారం పార్లమెంట్‌లోనూ వివాదాన్ని రేపింది. కాగా, న్యూఢిల్లీలోని మహారాష్ట్ర రెసిడెంట్ కమిషనర్ బిపిన్ మాలిక్‌కు ఈ వివాదమై క్యాంటీన్ మేనేజర్ శంకర్ మల్హోత్రా నివేదికను అందజేశారు. దీనిపై విచారే మాట్లాడుతూ.. సదన్‌లో యాజమాన్య లోపంపైనే తాను ధ్వజమెత్తాను తప్ప వేరే ఉద్దేశం లేదని వ్యాఖ్యానించారు.
పుట్టినరోజు వేడుకలు వద్దు : ఉద్ధవ్
సాక్షి, ముంైబె : తన పుట్టిన రోజు వేడుకలకు ఎలాంటి హోర్డింగులు, బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేయవద్దని కార్యకర్తలకు, పదాధికారులు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే సూచించారు. ఆయన పుట్టిన రోజు ఈ నెల 27న ఉంది. దీంతో అనవసరంగా డబ్బులు వృథా అయ్యే హోర్డింగులు, బ్యానర్లు ఏర్పాటుచేసే బదులు తను అప్పగించిన బాధ్యతలు నెరవేర్చే ప్రయత్నం చేయాలని ఉద్ధవ్ పిలుపునిచ్చారు.
పుట్టిన రోజున ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ పదాధికారులు, కార్యకర్తలు, అభిమానులు బాంద్రాలోని మాతోశ్రీ బంగ్లాకు తరలివస్తారు. వారు ఇబ్బందులు పడకుండా అక్కడ తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. దివంగత బాల్ ఠాక్రే సిద్ధాంతాలు, కన్న కలలు నెరవేర్చేందుకు కృషి చేయాలని సూచించారు.
‘ఊరుకొక శివసేన శాఖ’ అనే నినాదంతో ముందుకు వెళ్లాలని, ప్రతీ శాఖ కార్యాలయంపై కాషాయ జెండా రెపరెపలాండించాలని పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయాల బోర్డులను మరమ్మతులు చేయించాలని చెప్పారు. పార్టీని బలోపేతం చేయడానికి కృషిచేయాలని, అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని కోరారు.
మతం రంగు పూయొద్దు
Published Wed, Jul 23 2014 10:43 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement