'ఆ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సిందే'
- ఫిరాయించడం రాజకీయ అవినీతే!
- అనర్హత వేటు వేయడానికి పరిష్కార మార్గం చూడాలి
- 'సాక్షి’ తో శివసేన సీనియర్ ఎంపీ సంజయ్ రావత్
న్యూఢిల్లీ: ఒక పార్టీ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు అధికార పార్టీలోకి ఫిరాయించడం హేయమని, రాజకీయ అవినీతేనని శివసేన సీనియర్ ఎంపీ సంజయ్ రావత్ వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాల్లో ఫిరాయింపు ఎమ్మెలేలు రాజీనామా చేయాల్సిందేనని సంజయ్ రావత్ అభిప్రాయపడ్డారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయింపులపై సంజయ్ రావత్ బుధవారం 'సాక్షి' తో మాట్లాడారు. ఒక పార్టీ ఎన్నికల గుర్తుపై పోటీ చేసి గెలిచిన వారు వేరే పార్టీలో చేరాలనుకుంటే ముందుగా గెలిచిన పదవులకు రాజీనామా చేయాలి. తర్వాత, వేరే పార్టీలో చేరి తిరిగి పోటీ చేసి గెలవాలి అని ఆయన పేర్కొన్నారు.
సాధారణంగా ఒక పార్టీ ఎన్నికల గుర్తుపై పోటీ చేస్తే ఆపార్టీ విధానాలు, సిద్ధాంతాలు, పార్టీకి ఉన్న ప్రజాదరణ వల్లే అభ్యర్థులు గెలుస్తారన్నారు. అలా గెలిచిన వారు పార్టీ మారి వేరే పార్టీలో ఎలా కొనసాగుతారని, అది ఖచ్చితంగా రాజకీయ అవినీతేనని సంజయ్ రావత్ చెప్పారు. మహారాష్ట్ర ఘటనను ఉదాహరణగా చెప్తూ.. మహారాష్ట్రలో జరిగిన సంఘటనను వివరిస్తూ వేరే పార్టీకి చెందిన ఇరువురు ఎమ్మెల్యేలు శివసేనలో చేరాలనుకుంటే వారిని పదవులకు రాజీనామా చేయమని శివసేన నాయకత్వం సూచించిందని, దాంతో వారు రాజీనామా చేసి తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో శివసేన తరఫున పోటీ చేసి గెలిచారని సంజయ్ రావత్ చెప్పారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఫిరాయింపుల నిరోధక చట్టం నామమాత్రంగానే మిగిలి ఉందని, ఆ చట్టం శుద్ధ దండగ అని అభిప్రాయపడ్డారు.
ఒక పార్టీ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఒక్కరు వేరే పార్టీ లో చేరినా, ఒక గ్రూపుగా వేరే పార్టీ చేరినా అది ఫిరాయింపుగానే పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు. ఫిరాయింపుల కేసుల్లో స్పీకర్‌దే తుది నిర్ణయమని ఫిరాయింపుల నిరోధక చట్టంలో పేర్కొన్నారని, అందువల్ల కొన్ని సందర్భాలలో సమస్యలు తలెత్తున్నాయన్నారు. ఫిరాయింపుల కేసుల్లో అనర్హత వేటు వేయడానికి అఖిలపక్ష కమిటీ ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించాల్సి ఉందని, అయితే కొన్ని రాష్ట్రాల్లో అందువల్ల కూడా సమస్యలు తలెత్తే అవకాశాలు లేకపోలేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి అనువుగా ఫిరాయింపులపై ప్రతి రాజకీయ పార్టీ స్వచ్ఛందంగా ఖచ్చితమైన విధానాలను అవలంబించాల్సి ఉందని, శివసేన అదే విధానాన్ని పాటిస్తోందని సంజయ్ రావత్ వివరించారు.