నోట్ల రద్దుపై కేంద్రానికి ఎదురుదెబ్బ
హైకోర్టుల్లో కేసుల విచారణ నిలుపుదలకు సుప్రీం నో
న్యూఢిల్లీ: పాత రూ. 500, రూ. 1,000 నోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రద్దును వ్యతిరేకిస్తూ దేశంలోని వివిధ హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లను విచారించకుండా ఆదేశాలు ఇవ్వాలన్న కేంద్రం విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం బుధవారం తోసిపుచ్చింది. నోట్లను రద్దు చేస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించొద్దని కేంద్రం వేసిన పిటిషన్‌ను ఈ నెల 18న సుప్రీంకోర్టు తిరస్కరించడం తెలిసిందే. బ్యాంకులు, ఏటీఎంల వద్ద భారీ క్యూలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, ఇదే పరిస్థితి కొనసాగితే అల్లర్లకు దారి తీయొచ్చని, ఇలాంటి సమయంలో కోర్టుల తలుపులు మూసేయలేమని వ్యాఖ్యానించింది.
ఈ నేపథ్యంలో హైకోర్టుల్లో దాఖలైన కేసుల విచారణ ప్రక్రియను నిలిపేయాలని తాజాగా కేంద్రం సుప్రీంను ఆశ్రరుుంచింది. నోట్ల రద్దు కేసుల విచారణను సుప్రీంకోర్టు లేదా ఏదైనా ఒక హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్ విచారణ జరిపింది. ప్రస్తుతం పరిస్థితి చాలా వరకూ మెరుగుపడిందని, బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూలు తగ్గాయని, ఆన్‌లైన్‌లో నగదు వినియోగం బాగా పెరిగిందని అందువల్ల హైకోర్టుల్లో కేసుల విచారణపై స్టే విధించాలని కేంద్రం కోరింది. అరుుతే హైకోర్టుల్లో విచారణపై స్టే విధించేందుకు కోర్టు నిరాకరించింది. ఇందులో అనేక అంశాలు ఉన్నారుు. వీటిపై ప్రజలు హైకోర్టుల నుంచి తక్షణ ఉపశమనం పొందుతారు’ అని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావుతో కూడిన బెంచ్ పేర్కొంది. హైకోర్టు ముందుకు వచ్చిన అంశాల్లో విత్‌డ్రాలపై వారానికి రూ.24,000 పరిమితి విధించడం.. పాత రూ.500, రూ.1,000 నోట్లను ఆస్పత్రులు, పెట్రోల్ బంకుల్లో అనుమ తించాలని, ఏటీఎంల్లో సరిపడా నగదు నిల్వలు ఉంచేలా చర్యలు తీసు కోవాలని కోరుతూ పిటిషన్లు దాఖలయ్యాయని స్పష్టం చేసింది.
రూ. 10 లక్షల కోట్లకు చేరే అవకాశం
అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ నోట్ల రద్దు విజయవంతమైందని కోర్టుకు తెలిపారు. ఇప్పటి వరకూ రూ. 6 లక్షల కోట్లు డిపాజిట్లు వచ్చాయని, డిసెంబర్ చివరికి ఈ మొత్తం రూ. 10 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని అన్నారు. నగదును వివిధ ప్రాంతాలను రవాణా చేయడమే సమస్యగా మారిందని వివరించారు. అయితే కేంద్రం వాదనలతో కోర్టు సంతృప్తి చెందలేదు. వివిధ హైకోర్టులను ఆశ్రరుుంచిన పిటిషనర్లు, వ్యక్తులు స్పందన తెలియజేయాలని నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను డిసెంబర్ 2వ తేదీకి వారుుదా వేసింది.