
లక్నో : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముజఫర్‌నగర్‌లో గురువారం జరిగిన ఆందోళనలు, నిరసనలలో ప్రజా ఆస్తుల విధ్వంసానికి పాల్పడిన వారి ఆస్తులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సీజ్ చేసింది. ఇప్పటి వరకు ముజఫర్‌నగర్‌లో 67 దుకాణాలను సీజ్ చేయగా, త్వరలో వాటిని వేలం వేసి వచ్చిన ఆదాయంతో జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తామని అధికారులు ప్రకటించారు. అంతేకాక, తర్వాతి రోజు శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల అనంతరం రాష్ట్రంలోని 12 జిల్లాల్లో చట్టానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ క్రమంలో ముజఫర్‌నగర్, లక్నో, సంభాల్ ప్రాంతాల్లో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. 10 బైకులు, పలు కార్లు దహనమవడంతో పాటు 12 మంది పోలీసులు గాయపడ్డారు.
ఈ నేపథ్యంలో హింసకు కారణమైన వారిని సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలలో బంధించిన ప్రభుత్వం జరిగిన నష్టాన్ని వారితోనే భర్తీ చేయించే విధంగా చర్యలు చేపడుతోంది. అంతకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ.. ప్రజా ఆస్తుల విధ్వంసానికి కారణమైన వారి ఆస్తులను వేలం వేసైనా సరే, జరిగిన నష్టాన్ని పూడ్చుతామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు హింసకు కారణమైన వారిని గుర్తించి వారి ఆస్తులను సీజ్ చేస్తూ నోటీసులు జారీ చేశారు. లక్నోలో బాధ్యులను గుర్తించే ప్రక్రియ జరుగుతోందని స్థానిక పోలీస్ అధికారి వెల్లడించారు. కాగా, శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఆందోళనలో 13 మంది చనిపోయారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలపై ఆంక్షలు ఉన్న నేపథ్యంలో పోలీసులు 705 మందిని అరెస్ట్ చేసి, 124 కేసులు నమోదు చేశారు. అయితే ప్రజా ఆస్తుల విధ్వంసానికి పాల్పడిన వారి ఆస్తులను సీజ్ చేసి జరిగిన నష్టాన్ని పూడ్చడంపై ఉత్తరప్రదేశ్‌లో ఎలాంటి చట్టం లేకపోవడం గమనార్హం. చదవండి : వాళ్ల ఆస్తులు వేలం వేస్తాం: యూపీ సీఎం