భద్రతా బలగాల చేతిలో హతమైన జేఈఎమ్ టాప్ కమాండర్ చోటా నూరా (ఫైల్ ఫొటో)
శ్రీనగర్ : భద్రతా దళాల చేతిలో హతమైన జైషే ఈ మొహమ్మద్(జేఈఎమ్) టాప్ కమాండర్ నూర్ మహమ్మద్ తాంత్రే అలియాస్ చోటా నూరా(47) భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరేందుకు ప్రయత్నించినట్లు ఓ జాతీయ మీడియా సంస్ధ పేర్కొంది. బీజేపీలో చేరడం ద్వారా పార్టీకి చెందిన సీనియర్ నాయకులను హతమార్చాలని చోటా నూరా భావించినట్లు తెలిపింది.
2003లో చోటా నూరా ఈ ప్రయత్నాలు చేశాడని వెల్లడించింది. ఇందుకోసం న్యూఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని కూడా నూరా సందర్శించినట్లు వివరించింది. కార్యకర్తగా నమోదు చేసుకునేందుకు దరఖాస్తు పత్రాన్ని నూరా తెచ్చుకున్నాడని తెలిపింది. అయితే, ఈ ప్లాన్ అమలు కాకముందే పోలీసుల నూరాను అరెస్టు చేశారని చెప్పింది.
భారీగా ఆయుధాలు, ఆయుధ సామగ్రితో చోటా నూరా, అతని అనుచరులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారని పేర్కొంది. కేవలం మూడు అడుగులు మాత్రమే ఎత్తుండే నూరా జైషే కమాండర్‌గా కశ్మీర్‌లోని భద్రతా దళాలకు నిద్ర లేకుండా చేశాడు.
నూర్ స్వస్ధలం కశ్మీర్ లోయలోని త్రాల్ ప్రాంతం. శ్రీనగర్ అంతర్జాతీయ విమానశ్రయం వద్ద గల బీఎస్‌ఎఫ్ క్యాంప్‌పై దాడి, ఉడి ఉగ్రదాడి వెనుక నూర్ హస్తం ఉన్నట్లు రిపోర్టులు ఉన్నాయి. గత ఇరవై ఏళ్లలో భద్రతా బలగాలపై జరిగిన అత్యంత శక్తిమంతమైన దాడిగా ఉడి ఉగ్రదాడి గుర్తింపు పొందింది. 2015లో జైషేలో చేరిన నూర్‌కు ఆ తర్వాత కశ్మీర్ పరిసరాల్లో జరిగిన ప్రతి ఉగ్ర చర్యకు సంబంధాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment