
స్మృతికి మోదీ సోదరుడి షాక్
ఘజియాబాద్: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి ఊహించని పరిణామం ఎదురైంది. స్మృతి డిగ్రీ పట్టాలను పరిశీలించాలని ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ అన్నారు. స్మృతి నకిలీ సర్టిఫికెట్లు పొందారన్న ఆరోపణలపై విచారణ చేయాలని అభిప్రాయపడ్డారు.
అఖిల భారత రేషన్ డీలర్ల ఉపాధ్యక్షుడయిన ప్రహ్లాద్ ఘజియాబాద్లో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ మాజీ న్యాయ శాఖ మంత్రి, ఆప్ ఎమ్మెల్యే జితేందర్ సింగ్ తోమర్ కేసులాగే స్మృతి విషయంలో వ్యవహరించాలని ప్రహ్లాద్ మోదీ కోరారు. స్మృతి నకిలీ డిగ్రీలు పొందారని ఆరోపిస్తూ, వీటిపై విచారణ చేపట్టాలని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా ప్రధాని సోదరుడు ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడం స్మృతికి ఇబ్బందికర పరిస్థితి. నల్లధనం అంశం గురించి అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ.. విదేశాల్లో దాచిన నల్లధనాన్ని వెలికితీసేందుకు భారత ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీకి వీసా మంజూరు విషయంలో కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్పై వచ్చిన ఆరోపణలపై మాట్లాడుతూ.. మానవతా దృక్పథంతో సాయం చేశారని ప్రహ్లాద్ మోదీ అన్నారు.