వామ్మో! పాములంటూ ప్రజల బెంబేలు
న్యూఢిల్లీ: ఇళ్లలో, ఆఫీసుల్లో, పార్కుల్లో, చివరకు కారు ఇంజన్లలో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్న పాములను చూసి ఢిల్లీ వాసులు బెంబేలెత్తిపోతున్నారు. అంతేకాదు రోడ్ల మీద, ఇళ్లల్లో పెద్ద పెద్ద బల్లులు, తొండలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వామ్మో, పాములు! అంటూ ఈ ఒక్క నెలలోనే ఇప్పటి వరకు ఢిల్లీలోని వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి ప్రజల నుంచి వందకుపైగా ఫోన్లు వచ్చాయని ఆ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. వర్షాకాలం అవడం వల్ల వర్షం నీటికి గూడు చెదిరి, కూడు చెదిరి నగరంలోకి పాములు రావడం సహజమేనని వన్యప్రాణి సంరక్షకులు చెబుతున్నారు.
ఢిల్లీకి సమీపంలోని అరవిల్లి కొండపైన పాములు, బల్లులు, ఉభయచరాలు ఎక్కువగా ఉన్నాయని, వర్షాల వల్ల అవన్ని నగరానికి వస్తున్నాయని హెర్పంటాలజిస్ట్ ప్రొఫెసర్ సంజయ్ కే. దాస్ తెలిపారు. ఢిల్లీలోని తుగ్లకాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్ కార్యాలయం వద్ద ఏడు అడుగుల పొడవున్న కొండ చిలువను బుధవారం నాడు వన్యప్రాణి సంరక్షకులు పట్టుకున్నారు. అలాగే దక్షిణ ఢిల్లీ, సైనిక్ ఫామ్స్, ఛాటర్‌పూర్, వసంత్ కుంజ్, పంచ్‌శీల్ విహార్, ఆగ్నేయ ఢిల్లీలోని మోడల్ టౌన్‌లో అనేక ప్రాణులను వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అధికారులు, ఎన్జీవో కార్యకర్తలు పట్టుకున్నారు.
ఇప్పటివరకు నగరంలో తాము పట్టుకున్న పాముల్లో ప్రమాదకరమైనవి నాగుపాలేనని, మిగతా చాలా పాములు విషంలేని పాములేనని, వాటిని చూసి ప్రజలు అనవసరంగా భయపడవద్దని ఎన్జీవో కార్యకర్తలు చెబుతున్నారు. అయితే ప్రమాదాన్ని కోరితెచ్చుకోవద్దని, పాములు కనిపిస్తే తమ ఇరవై నాలుగు గంటల సర్వీసుకు ఫోన్ చేయాలని వన్యప్రాణి సంరక్షణ అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. వర్షాకాలంలో వెచ్చదనం కోసమే పాములు ఎక్కువగా ఇళ్లలోకి, కార్లలోకి ప్రవేశిస్తాయని, వర్షాకాలం తర్వాత వాటి రాక తగ్గిపోతుందని వారు చెబుతున్నారు.