టెకీ రక్తమోడుతుంటే సెల్ఫీలా!
పుణే: తీవ్ర రక్తస్రావం అవుతున్నా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రాణాలు కాపాడాలనే ఆలోచన కూడా లేకుండా వీడియోలు, ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. మరికొంత సమయానికి ఓ వ్యక్తి స్పందించి ఆస్పత్రికి తరలించినా టెకీ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ విషాదం పుణేలోని భోసారిలో బుధవారం చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సతీవ్ ప్రభాకర్ మెటే స్వస్థలం ఔరంగాబాద్ కాగా మోషిలో నివాసం ఉంటున్నారు. స్థానిక బోసారిలో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండేవాడు.
ఏదో పని మీద సతీశ్ బుధవారం సాయంత్రం బయటకు వెళ్లారు. భోసారిలో రోడ్డుపై వెళ్తుండగా ఓ గుర్తుతెలియని వాహనం టెకీని ఢీకొట్టింది. అతడికి ఏమైందో చూడకుండా ఆ వాహనం డ్రైవర్ అలాగే వెళ్లిపోయాడు. కొన్ని క్షణాల్లోనే పదుల సంఖ్యలో జనాలు టెకీ చుట్టూ గుమిగూడారు. ఓవైపు తీవ్రంగా రక్తస్రావమవుతున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సతీశ్‌ను కాపాడాల్సింది పోయి, కొందరు వీడియో తీస్తున్నారు. మరికొందరు గాయపడ్డ టెకీని ఫొటోలు, సెల్ఫీలు తీశారు. ఇంతలో కార్తీరాజ్ కాటే అనే డెంటిస్ట్ జరిగిన దారుణాన్ని చూసి చలించిపోయారు. కొందరి సాయంతో టెకీ సతీశ్‌ను పింపిరిలోని యశ్వంత్‌రావు చౌహాన్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. టెకీని పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతిచెందినట్లు నిర్ధారించారు.
టెకీ సతీశ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లిన డెంటిస్ట్ కార్తీరాజ్ మాట్లాడుతూ.. బోసారిలో ఓ చోట కొందరు గుమిగూడగా వెళ్లిచూసి షాకయ్యాను. ఓ వ్యక్తి రక్తపు మడుగులో అపస్మారకస్థితిలో పడి ఉండగా చుట్టూ ఉన్నవారు సహాయం చేయాల్సింది పోయి తమ ఫోన్లలో ఇది చిత్రీకరిస్తున్నారు. నేను స్పందించినా అప్పటికే ఆలస్యమైందని ఆయన వాపోయారు. టెకీని ఢీకొన్న వాహనం నెంబర్‌ను గుర్తించిన వారు 020-27130003 కు కాల్ చేసి వివరాలు అందించాలని ఇన్‌స్పెక్టర్ భిమ్‌రావ్ షింగాడో కోరారు.