బొగ్గు ప్రైవేటీకరణకు కుట్ర
ప్రధాని మోదీపై సోనియా ధ్వజం
పటాందా: బొగ్గు రంగాన్ని ప్రైవేటుపరం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రణాళికలు వేస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ విరుచుకుపడ్డారు. ప్రజలను బలిచేసి జార్ఖండ్‌లోని బొగ్గును కొద్దిమంది పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టేందుకు మోదీ కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. శనివారం జార్ఖండ్‌లోని పటాందాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో సోనియా మాట్లాడారు. గిరిజనులు, దళితుల ప్రయోజనాలను దృష్టిలోపెట్టుకొని యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన సమాచార హక్కు చట్టం, భూసేకరణ, ఉపాధి హామీ చట్టాలను మోదీ ప్రభుత్వం నీరుగారుస్తోందని దుయ్యబట్టారు.
గుజరాత్ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టం వల్ల అక్కడి గిరిజనులు తీవ్రంగా నష్టపోయారని, దీనివల్ల పెట్టుబడిదారులు ప్రయోజనం పొందారని విమర్శించారు. ఖనిజ సంపద అపారంగా ఉన్న జార్ఖండ్‌ను బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాలు లూటీ చేశాయని, అందువల్ల ప్రజలు ఈసారి కాంగ్రెస్‌కు మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. కాగా, సోనియా ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆమె 90 నిమిషాలపాటు విమానాశ్రయంలో నిరీక్షించాల్సి వచ్చింది. దీంతో ఆమె వేరే విమానంలో పటాందాకు వెళ్లారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి లాల్‌కిశోర్ చెప్పారు. జార్ఖండ్‌లో డిసెంబర్ 2న రెండో దశ పోలింగ్ జరగనుంది.