‘బొగ్గు’లోనూ గూఢచర్యం! | Spying to be done in coal mining | Sakshi
Sakshi News home page

‘బొగ్గు’లోనూ గూఢచర్యం!

Published Tue, Feb 24 2015 2:50 AM | Last Updated on Thu, Jul 26 2018 1:56 PM

‘బొగ్గు’లోనూ గూఢచర్యం! - Sakshi

‘బొగ్గు’లోనూ గూఢచర్యం!

* కోల్, విద్యుత్ శాఖల రహస్య పత్రాల చేరవేత
* ఆరోపణలపై ఒకరి అరెస్టు.. అదుపులో మరో ఆరుగురు

 
న్యూఢిల్లీ: కార్పొరేట్ గూఢచర్యం ఒక్క చమురుశాఖకే పరిమితం కాలేదు! బొగ్గు, విద్యుత్ శాఖల్లో కూడా ఇదే తతంగం చోటుచేసుకుంది. తాజాగా ఈ రెండు శాఖల నుంచి రహస్య పత్రాలు బయటకు తరలించారన్న ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు నోయిడాలోని ఇన్‌ఫ్రా లైన్ కన్సల్టెన్సీ కంపెనీకి చెందిన లోకేశ్ శర్మ(33)ను అరెస్టు చేశారు. ఆయన నుంచి నకిలీ ఐడీ కార్డులు, కీలక  పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మరో ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఢిల్లీలో విసృ్తతంగా సోదాలు నిర్వహిస్తున్నారు.
 
 లోకేశ్‌ను సోమవారం చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా.. నిందితుడిని ఐదు రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. చమురుశాఖలో కీలక పత్రాల చోరీ కేసులో ఢిల్లీ పోలీసులు ఇప్పటికే 12 మందిని అరెస్టు చేయడం తెలిసిందే. వీరిలో శంతను సైకియా, ప్రయాస్ జైన్‌లను విచారించగా, లోకేశ్ పాత్ర వెలుగులోకి వచ్చింది. ‘ఈ రాకెట్‌లో లోకేశ్ కీలక పాత్ర పోషించాడు. పెట్రోలియం, బొగ్గు, విద్యుత్ శాఖల్లో పనిచేసే సిబ్బంది ద్వారా ఇతడు రహస్య డాక్యుమెంట్లను సేకరించేవాడు. వాటిని తన కంపెనీకి ఇవ్వడంతోపాటు బయట కూడా అమ్ముకునేవాడు అని ఢిల్లీ జాయింట్ కమిషనర్(క్రైం) రవీంద్ర తెలిపారు. చమురు శాఖలో వెలుగుచూసిన గూఢచర్యంతో సంబంధం లేకుండా దీన్ని వేరే కేసుగా పరిగణిస్తూ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశామని, లోకేశ్ ఇచ్చిన సమాచారంతో మరికొందరిని అరెస్టు చేస్తామని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు. రహస్య పత్రాలను వీరు ఎలా చేరవేశారు, వాటి ద్వారా ఎవరు లబ్ధి పొందారని అడగ్గా.. లోకేశ్ అనుచరులను కూడా విచారిస్తే ఈ వివరాలు తెలిసే అవకాశం ఉందన్నారు.చమురు శాఖలో గూఢచర్యం కేసులో అరెస్టయిన నలుగురి నిందితులు లాల్తా ప్రసాద్, రాకేశ్, ప్రయాస్ జైన్, శంతను సైకియాలకు ఢిల్లీ కోర్టు మార్చి 6 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కస్టడీ గడువు ముగియడంతో పోలీసులు వారిని సోమవారం మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పోలీసులు తమతో ఖాళీ పేపర్లపై బలవంతంగా సంతకాలు తీసుకున్నారని వారు కోర్టుకు చెప్పారు. కేసు డైరీపై కోర్టు సంతకం చేయాలని వారి న్యాయవాది వాదించగా.. అందుకు కోర్టు సమ్మతించింది.
 
  సోదాలు జరగలేదు: రిలయన్స్
 కార్పొరేట్ గూఢచర్యం కేసులో దేశవ్యాప్తంగా తమ కార్యాలయాలపై ఎక్కడా కూడా పోలీసులు దాడులు జరపలేదని అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. దర్యాప్తు అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నట్లు తెలిపింది. రిలయన్స్ పవర్‌లో పనిచేసే ఓ ఉద్యోగి కార్యాలయంలోనే పోలీసులు సోదారుల జరిపారని, అయితే నేరానికి సంబంధించి ఆయన నుంచి ఎలాంటి సమాచారం లభ్యం కాలేదని వివరించింది. తమ వ్యాపారాల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు తావు లేదని స్పష్టంచేసింది. గూఢచర్యం కేసులో అరెస్టయిన ఐదుగురు కార్పొరేట్ అధికారుల్లో రిలయన్స్ గ్రూపుకు చెందిన రిషీ ఆనంద్ కూడా ఉన్న సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement