కర్ణాటకలో 'స్టింగ్ ఆపరేషన్' కలకలం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపునకు సహకరించడానికి కొంతమంది ఎమ్మెల్యేలు రూ. కోట్లకు ఆశపడుతున్నట్లు ఒక టీవీ చానల్ స్టింగ్ ఆపరేషన్‌లో బయటపడింది. కాంగ్రెస్‌కు అసెంబ్లీలో ఉన్న బలాన్ని బట్టి ఇద్దరు అభ్యర్థులను గెలిపించుకోవచ్చు. కానీ మూడో అభ్యర్థిని రంగంలోకి దించింది.
రెండ్రోజుల ముందు ఒక టీవీ చానల్ ప్రతినిధులు జేడీఎస్ ఎమ్మెల్యేలు మల్లికార్జున ఖూబా, జి.టి.దేవేగౌడ, కర్ణాటక జనతా పార్టీ ఎమ్మెల్యే బి.ఆర్.పాటిల్‌ను కలవగా.. వారు ఒక్కో ఓటుకు రూ.5 కోట్ల నుంచి రూ. 10 కోట్ల వరకు డిమాండ్ చేసిన దృశ్యాలు బయటపడ్డాయి. మరో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడా బేరసారాలు సాగించినట్టు రహస్య వీడియాలో ఉంది.
కర్ణాటకలోని నాలుగు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ తరపున ఆస్కార్ ఫెర్నాండెజ్, జైరాం రమేశ్, కేసీ రామమూర్తి, బీజేపీ నుంచి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, జేడీ(ఎస్) తరపున బీఎస్ ఫరూఖ్ నామినేషన్లు దాఖలు చేశారు. 225 స్థానాలున్న కర్ణాటకలో అసెంబ్లీలో కాంగ్రెస్ కు 123, జేడీ(ఎస్)కు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మిగిలిన ఓట్లు పోను రామమూర్తికి మరో 12 ఓట్లు అవసరం.
మరోవైపు జేడీ(ఎస్)కు చెందిన ఐదుగురు రెబల్ ఎమ్మెల్యేలు పార్టీ విప్ ను ఉల్లఘించి రామమూర్తికి ఓటు వేస్తామని బెదిరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈ నెల 11న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి.