
'గే' అంటూ ఏడిపించారని.. ఆత్మాహుతి యత్నం
స్నేహితులతో సన్నిహితంగా ఉన్నందుకు తనను 'గే' అంటూ ఏడిపించారని.. ఇంటర్ విద్యార్థి డీజిల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మాహుతి యత్నం చేశాడు. మంటల బాధ తాళలేక అరుచుకుంటూ రూంలోంచి బయటకు పరుగులు తీసిన అతడిని కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగులు చూసి, అతడిమీద నీళ్లు పోశారు. దుప్పట్లు కప్పి.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అతడికి 40 శాతం కాలిన గాయాలయ్యాయి. ఈ ఘటన ఆగ్రా నగరంలో జరిగింది. బాలుడి కాళ్ల మీద, ఎద భాగంలో బాగా కాలినట్లు వైద్యులు చెప్పారు. అతడు సరిగా మాట్లాడలేకపోతున్నాడని, డాక్టర్లు అంతా బాగానే ఉందని చెబుతున్నా, తన కొడుకు మళ్లీ తనతో మాట్లాడితేనే నమ్ముతానని బాధితుడి తండ్రి అంటున్నారు. పదోతరగతిలో మంచి మార్కులతో పాసైన ఆ కుర్రాడు.. ఇంజనీరింగ్ చదవాలని కలలు గంటున్నాడు.
రెండురోజుల క్రితం దగ్గర్లో ఉన్న పార్కులో స్నేహితుడితో కలిసి ఉండగా.. పొరుగున ఉండే ఓ వ్యక్తి చూసి, ఈ కుర్రాడిని 'గే' అంటూ ఏడిపించాడు. ఆ విషయం చుట్టుపక్కల అందరికీ తెలిసిపోయింది. ప్రతి ఒక్కరూ అతడిని ఏడిపించడం మొదలుపెట్టారని అతడి తండ్రి చెప్పారు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురై రెండు రోజులుగా తన రూంలోనే ఉండిపోయాడని, ఉన్నట్టుండి గదిలోంచి పరుగున బయటకు వచ్చాడని.. తీరా చూస్తే అప్పటికే మంటలు బాగా వ్యాపించాయని ఆయన తెలిపారు. ఆ కుర్రాడు కాలనీలో పార్క్ చేసి ఉన్న కారులోంచి డీజిల్ తీసి.. దాన్నే తనపై పోసుకున్నట్లు చెబుతున్నారు.