న్యూఢిల్లీ: ‘ఉదయం 8 గంటలు.. ప్రణీత్ వాళ్ల మమ్మీతో కలిసి రోడ్డుపైన బస్సు కోసం వేచి చూస్తున్నాడు.. అతడికి ఇంకా పూర్తిగా నాలుగేళ్లు నిండలేదు.. భుజాలకు 10 కిలోలకు పైగానే బరువున్న పుస్తకాల బ్యాగు, చేతిలో టిఫిన్ బాక్సు, వాటర్ బాటిల్ ఉన్న ప్లాస్టిక్ బుట్ట ఉన్నాయి. అంతలో స్కూ లు బస్సు రానే వచ్చింది.. అప్పటికే అది పిల్లలతో నిండిపోయి ఉంది.. ప్రణీత్ అతికష్టం మీద అందులోకి ఎక్కాడు.. పుస్తకాల బ్యాగ్ తీసి ఒక మూలన పడేశారు.. అతడి తల్లి పిల్లాడి పరిస్థితిని చూసి నిట్టూర్చడం తప్ప ఏం చేయలేకపోయింది.. బస్సు కదిలింది నిండు గర్భిణిలా..’
నగరంలో ఏ స్కూల్ బస్సు చూసినా అటుఇటుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సామర్థ్యానికి మించి పిల్లలను వాటిలో కుక్కి తీసుకుపోతున్నారు. అంతేకాక పాఠశాలకు పిల్లలను తొందరగా చేర్చాలన్న ధ్యాసలో వేగంగా వెళ్లి ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్న సంఘటనలు కూడా కోకొల్లలు. దీంతో చిన్నారుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసినట్లవుతోంది. కాగా, ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. అన్ని ప్రైవే ట్ స్కూళ్లు ‘రక్షిత రవాణా’ను తప్పక పాటిం చాలని ఆదేశించింది.
తమ పిల్లలకు మంచి రవాణా సౌకర్యాన్ని ఏర్పాటుచేయాలని, చట్టబద్ధం కాని వ్యాన్‌లను నడపవద్దని ఆయా పాఠశాలల యాజమాన్యాలను తల్లిదండ్రులు కోరవచ్చని సూచిచింది. సామర్థ్యానికి మించి పిల్లలను ఎక్కించుకువచ్చే వ్యాన్‌లపై కఠనంగా వ్యవహరించనున్నట్లు ఇటీవల విద్యాశాఖ డెరైక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా వ్యాన్లలో సీటింగ్ కెపాసిటీకి మించి పిల్లలను ఎక్కిస్తే వాటి అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు. అలాగే విద్యార్థులున్న స్కూల్ వ్యాన్లను నిర్లక్ష్యంగా నడిపే డ్రైవర్లపై కఠిన చర్యలు తప్పవని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, ఇప్పటికీ పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు ప్రైవేట్ వ్యాన్లపైనే ఆధారపడుతున్నారు. ఈ సందర్భంగా సేఫ్-ట్రస్టీ ఆఫ్ సేఫ్ రోడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మహ్మద్ ఇమ్రాన్ మాట్లాడుతూ..‘చాలా చిన్న పాఠశాలలకు సొంత బస్సులు ఉండవు..వారు ప్రైవేట్ వాహనాలను అద్దెకు తీసుకుని వాటినే తమ సొంత వాహనాలుగా తల్లిదండ్రులకు చూపుతారు. తల్లిదండ్రుల నుంచి రవాణా చార్జీల కింద ఎక్కువ వసూలు చేసి వ్యాన్ యజమానులకు తక్కువ చెల్లిస్తారు. అలాగే, ఎటువంటి ప్రమాదాలు జరిగినా తమ బాధ్యత ఏమీ ఉండదని చెబుతారు. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తల్లిదండ్రులు వారిని ప్రశ్నిస్తే మా బాధ్యత ఉండదని మొదటే చెప్పాం.. మీరు డ్రైవర్‌తోనే మాట్లాడుకోండి.. అని దబాయిస్తుంటార’ని తెలిపారు.
అయితే స్కూలు యాజమాన్యాలకు ఈ వ్యాన్లపై ఏదైనా ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పిల్లలు ఎటువంటి ఇబ్బందులు పడాల్సి వస్తుందోనని తల్లిదండ్రులు సైతం వ్యాన్ డ్రైవర్లపై ఫిర్యాదు చేసేందుకు జంకుతున్నారని వివరించారు. ‘ఇటువంటి సంఘటనలపై ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా మేం ఏమీ చేయలేం.. ఆయా పాఠశాలల యాజమాన్యాలు పిల్లల రవాణాపైనే కాదు.. యూనిఫారాలు, పుస్తకాలు ఇలా అన్ని విభాగాలపైనా తల్లిదండ్రుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు కాని ఆ స్థాయిలో సేవ లు అందించడంలేద’ని ఇమ్రాన్ ఆవేదన వ్యక్తం చేశారు.
చాలావరకు ప్రైవేట్ వాహనాలను చట్టవిరుద్ధంగా నడుపుతున్నారు.‘ ఆయా పాఠశాలలకు ఈ వ్యాన్‌లను చాలావరకు పోలీసులే సూచిస్తున్నారు. ఎప్పుడైనా మేం ఆ వ్యాన్ వాళ్లను ప్రశ్నిస్తే.. మా కోసమే కాక వేరే (పోలీస్) వారి కోసం కూడా మేం సంపాదించాల్సివస్తోంది.. అందువల్లనే ఈ పరి స్థితి..’ అని వారు తమ నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారని ఇమ్రాన్ తెలిపారు.
ఇదిలా ఉండగా, ఈ విషయమై ఐదేళ్ల విద్యార్థి తల్లి దీక్షా సేథ్ మాట్లాడుతూ..‘ ప్రతి నెలా స్కూలు వాళ్లు బస్ కోసం రూ.1,800 వసూలు చేస్తున్నారు. మా అబ్బాయి కోసం మాట్లాడుకున్న ప్రైవేట్ వ్యాన్‌కు నేను నెలకు కేవలం రూ.600 చెల్లిస్తున్నా.. వాళ్లు అబ్బాయిని మా అపార్ట్‌మెంట్ గేట్ వద్దే ఎక్కించుకుని, మళ్లీ అక్కడే దింపుతారు. దాంతో నాకు వాడికోసం ఎక్కడో వేచి చూడాల్సిన అవసరం తప్పింది.. స్కూల్ బస్సులు అలాకాదు.. వాటి కోసం మనం తప్పనిసరిగా వేచి చూడాల్సిందే..’నని తెలిపారు.
మరో విద్యార్థి తల్లి రీమా అగర్వాల్ మాట్లాడుతూ..‘ ప్రైవేట్ వ్యాన్ వాళ్లయితే ఎప్పుడైనా మా అబ్బాయికి స్కూల్‌లో కొంచెం ఆలస్యమైనా అత నికోసం వేచి ఉంటారు. స్కూల్ బస్సులు అలా కాదు.. వారు ఎవరికోసం వేచి చూడారు.. అందుకే ప్రైవేట్ వ్యాన్‌లనే మేం నమ్ముకుంటున్నా’మని చెప్పారు. ‘మాకు ప్రభుత్వం ఇచ్చిన అనుమతి మేరకు ఏడు లేక ఎనిమిది మంది విద్యార్థులను మాత్రమే ఎక్కించుకుపోవాలి. అయితే దానివల్ల మాకు ఉపయోగం ఉండదు. అదనపు ఆదాయం కోసం ఎక్కువ మంది విద్యార్థులను ఎక్కించుకోవడం తప్ప మాకు గత్యంతరం లేదు.. అని తన పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక వ్యాన్ డ్రైవర్ స్పష్టం చేశాడు.
ఆ బస్సులు మాకొద్దు..!
Published Fri, Jul 11 2014 11:47 PM | Last Updated on Thu, May 24 2018 1:53 PM
Advertisement
Advertisement