
రాజ్యసభలో రామమందిరం కలకలం
అయోధ్యలో రామ మందిరం అంశం మరోసారి రాజ్యసభలో కలకలం రేపింది. బీజేపీ సభ్యుడు సుబ్రమణ్యం స్వామి ఈ అంశాన్ని గురువారం నాటి సభలో ప్రస్తావించారు. సుప్రీంకోర్టులో ఈ అంశంపై రోజంతా విచారణ జరుగుతోంది కాబట్టి ప్రభుత్వం ఈ అంశంపై ప్రకటన చేయాలని, దీని గురించి ఇప్పటికే అందరూ బాగా విసుగెత్తిపోయారని ఆయన అన్నారు.
ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి కూడా సుప్రీంకోర్టులో కేసులు పెండింగులో ఉండిపోవడాన్ని ప్రస్తావించారని, అయితే రామమందిరం అంశం చాలా కష్టమైన సమస్య అని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు ఏం చెబితే అది చేయడానికి రెండు వర్గాలూ అంగీకరించాయని, అందువల్ల సుప్రీం నిర్ణయం వస్తే వెంటనే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. దీనిపై ప్రతిపక్షాలు ఒక్కసారిగా గగ్గోలు పెట్టాయి. సభ ఏమనుకుంటోందన్న విషయం తెలియాలని, రామమందిర అంశాన్ని గురించి నిర్ణయించాలని ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్యే స్వామి తెలిపారు. సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణపై ప్రభుత్వం ప్రకటన చేయాలని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పి.జె. కురియన్ అన్నారు.