
‘రాజీ రాకుంటే కోర్టే పరిష్కరించాలి’
లక్నో: అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై ముస్లింలు రాజీకి రాకుంటే, సుప్రీంకోర్టు పరిష్కరించాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యానించారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో గురువారం భేటీ అయిన స్వామి అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత వివాదాస్పద ప్రదేశంలో రామ మందిర నిర్మాణం ఉన్నట్లు 2010లో అలహాబాద్ హైకోర్టు పేర్కొందని గుర్తు చేశారు. న్యాయపరంగా కూడా మందిర నిర్మాణంపై విజయం సాధిస్తామన్నారు.
స్వామి వ్యాఖ్యలను బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ (బీఎంఏసీ) కన్వీనర్ జాఫర్‌యాబ్ జిలానీ ఖండించారు. స్వామి ముస్లింలను బెదిరించడం సరికాదన్నారు. తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకముందన్నారు. ‘ఈ విషయం సామరస్యంగా పరిష్కారమైతే సరి. లేకుంటే రాజ్యసభలో 2018 ఏప్రిల్‌లో తమకు పూర్తి మెజారీటీ వచ్చిన తర్వాత రామమందిర నిర్మాణానికి సంబంధిచి చట్టాన్ని తీసుకొస్తాం’ అని గతంలో స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.