'సమస్య అంతా ఆయన వల్లే'
న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ కొనుగోళ్లలో అక్రమాల వ్యవహారం వరుసగా రెండో రోజూ రాజ్యసభను కుదిపేసింది. రెండు రోజుల క్రితం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ ఎంపీ సుబ్రమణ్యంస్వామిపై విపక్ష నేత గులాంనబీ ఆజాద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డరారు.
'పార్లమెంట్ లో ఆయనకు ఇది రెండో రోజు మాత్రమే. ఈ రెండు రోజులుగా ఆయన మాటలను రికార్డుల నుంచి తొలగిస్తూనే ఉన్నారు. ఇంకా ఎన్నిరోజులు ఇలా చేస్తారు? ఆయనకు వయసు పెరిగింది కానీ వీధి మాటలకు, పార్లమెంట్ మాటలకు తేడా తెలియడం లేద'ని ఆజాద్ అన్నారు. తలకు రంగేసుకోగానే సరిపోదని, విజ్ఞత అలవరుచుకోవాలని చురకలు అంటించారు. దీంతో జీరో అవర్ లో గందరగోళం రేగింది.
డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ సభ్యులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. సభ్యుల ఆందోళనతో జీరో అవర్ తుడిచిపెట్టుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యంతా బీజేపీ కొత్త కానుక(బీజేపీ న్యూ గిఫ్ట్) వల్లే అంటూ పరోక్షంగా సుబ్రమణ్యంస్వామిని ఆజాద్ విమర్శించారు. సోనియా గాంధీపై సుబ్రమణ్యంస్వామి చేసిన విమర్శలను రికార్డుల నుంచి తొలగించారు. సభలో లేని వారి గురించి వ్యాఖ్యలు చేయడం భావ్యం కాదని డిప్యూటీ చైర్మన్ పేర్కొన్నారు.