టాయ్లెట్ల నిర్మాణ సంస్థ సులభ్ ఇంటర్నేషనల్ ఓ కాపురాన్ని నిలబెట్టింది. ఇంటిలో టాయ్లెట్ కట్టించనందుకు భర్తతో గొడవపడి విడాకులు కోరిన భార్యకు ఆసరాగా నిలిచింది.
పాట్నా: టాయ్లెట్ల నిర్మాణ సంస్థ సులభ్ ఇంటర్నేషనల్ ఓ కాపురాన్ని నిలబెట్టింది. ఇంటిలో టాయ్లెట్ కట్టించనందుకు భర్తతో గొడవపడి విడాకులు కోరిన భార్యకు ఆసరాగా నిలిచింది. సొంత ఖర్చులతో అధునాతనమైన టాయ్లెట్ ఏర్పాటు చేస్తామని సులభ్ ఇంటర్నేషనల్ ముందుకొచ్చింది. ఇందుకు అవసరమైన మొత్తాన్ని ఆమెకు బహుమతిగా ఇచ్చింది. దీంతో భార్యాభర్తలు రాజీకి వచ్చి విడాకుల ప్రతిపాదన విరమించుకున్నారు.
బీహార్లోని పాట్నా జిల్లా సాదేషొపూర్ వాసి అలక్ నిరంజన్ భార్య ఐదేళ్లుగా టాయ్లెట్ కోసం పోరాడుతోంది. పెళ్లయినపుడు టాయ్లెట్ కట్టిస్తానని వాగ్దానం చేసిన అలక్ అనంతరం విషయం మరచిపోయాడు. ఆయన భార్య పలమార్లు ఈ విషయం ప్రస్తావించినా పట్టించుకోలేదు. చివరకు భార్యభర్తలిద్దరూ గొడవ పడ్డారు. అలక్ చేయి చేసుకోవడంతో భార్య విడాకులు ఇప్పించాల్సిందిగా మహిళల హెల్ప్లైన్ను ఆశ్రయించింది. ఈ విషయం తెలుసుకున్న సులభ్ ఇంటర్నేషనల్ ఆర్థిక సాయం చేయడంతో భార్యభర్తలు కలసిమెలసి ఉండేందుకు అంగీకరించారు.