సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సుందర్ పిచాయ్ తొలిసారి ఇండియాకు రాబోతున్నారు. భారత పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. కాగా.. ఈ పర్యనటలో కొత్త ప్రాడక్ట్ లాంచింగ్ ఏమీ ఉండబోదని గూగుల్ వర్గాలు తెలిపాయి. అయితే.. ఈ పర్యటనలో పిచాయ్ గూగుల్ ఉద్యోగులను కలవనున్నారు. రెండు రోజుల భారత పర్యటనలో పిచాయ్ బుధవారం మీడియా సమావేశంలో పాల్గొంటారు.
అదే రోజు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో సమావేశం కానున్నారు.తన పర్యటనలో రెండో రోజు శ్రీరామ్ కాలేజీలో జరగబోయే ఓ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. అటునుంచి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి ఇవ్వనున్న విందులో సుందర్ పిచాయ్ పాల్గొంటారు.
సెప్టెంబర్‌లో అమెరికా వెళ్లిన మోదీ సిలికాన్ వ్యాలీని సైతం సందర్శించారు. అప్పుడు పిచాయ్ ప్రధానితో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా గూగుల్.. భారతీయ రైల్వే శాఖతో కలిసి దేశంలో ఉచిత వై ఫై కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. కాగా.. పిచాయ్ తాజా పర్యనటలో గూగుల్ భారత్ లో చేపట్టబోయే భవిష్యత్ కార్యక్రమాల ప్రణాళికను ప్రకటించే అవకాశం ఉంది.