కోడిపందాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: సంక్రాంతి కోడిపందాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు వెలువరించింది. కోడిపందాలకు అనుమతి ఇవ్వాలని దాఖలైన పిటిషన్ పై శుక్రవారం విచారణ ప్రారంభించింది. కోళ్లను నిర్బంధించడంపై సర్వోన్నత న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. సంక్రాంతికి కోళ్ల పందాలను నిషేధిస్తూ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల్లో నాలుగో అంశంపై స్టే విధించింది.
కోళ్లను స్వాధీనం చేసుకోవద్దని, కోడి పందాలకు వాడే ఆయుధాలను సీజ్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. సంక్రాంతి కోడిపందాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బీజేపీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.