
న్యూఢిల్లీ: గుజరాత్ ఎన్నికల ఫలితాల విడుదల కావడానికి ముందు సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్ ఎన్నికలపై కాంగ్రెస్ వేసిన రిట్ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. వీవీపీఏటీ యంత్రాల్లో పోలైన ఓట్లలో కనీసం 25 శాతం ఓట్లను పరిశీలించేలా ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ శుక్రవారం పిటిషన్ వేసింది. ఈవీఎంలో వేసిన ఓటు కరెక్ట్‌గా పడిందో, లేదో తెలుసుకునేందుకు వీవీపీఏటీ విధానాన్ని వినియోగిస్తున్నారు. ఓటు వేసిన వెంటనే తమ ఎవరికి పడిందో ఓటర్లు తెలుసుకునేందుకు ఒక స్లిప్ వస్తుంది. ఈ స్లిప్పుల్లో ఉన్నట్టుగా ఈవీఎంలో ఓట్లు ఉన్నాయో, లేదో ఈసీ పరిశీలించేలా ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టును కాంగ్రెస్ కోరింది.
కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. ప్రస్తుత దశలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అభిషేక్ మాను సింఘ్వి, కపిల్ సిబల్ కాంగ్రెస్ తరపున వాదనలు వినిపించేందుకు కోర్టులో హాజరయ్యారు. ఎలక్ట్రోరల్ వ్యవస్థపై విశ్వాసం పెంచాల్సిన అవసరముందని గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భరత్ సొలాంకి వ్యాఖ్యానించారు. కాగా, ఎన్నికల సంఘం ప్రధాని నరేంద్ర మోదీ చేతిలో కీలుబొమ్మలా మారిందని కాంగ్రెస్ నాయకులు గురువారం ఆరోపించారు. కోడ్ ఉల్లంఘించినా మోదీపై ఈసీ చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment