యూపీఎస్‌సీ ప్రిలిమ్స్ వాయిదాకు సుప్రీం నో
చివరి నిమిషంలో వాయిదా వీలుపడదని స్పష్టీకరణ
న్యూఢిల్లీ: యూపీఎస్‌సీ ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా వేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఫిర్యాదుదారుడికి నిరాశే ఎదురైంది. 9లక్షల మంది విద్యార్థులు హాజరయ్యే ఈ పరీక్షను చివరి నిమిషంలో వాయిదా వేయడం వీలుపడదని పిటిషనర్ అంగేష్ కుమార్‌కు అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఆదివారం పరీక్ష జరగనున్న నేపథ్యంలో శనివారం కోర్టుకు సెలవుదినమైనా ఈ పిటిషన్‌ను ప్రత్యేకంగా విచారించిన జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం.. సైన్స్ విద్యార్థులకు ఈ పరీక్ష అనుకూలంగా ఉందన్న వాదనను అంగీకరించలేదు. విద్యార్థులు ఆందోళన లేవనెత్తిన కాంప్రహెన్షన్ విభాగం తొలగించడం వల్ల సమస్య పరిష్కారమైందని తెలిపింది.
ప్రిలిమినరీస్‌లో ఇంగ్లిష్ కాంప్రహెన్సివ్ ప్రశ్నలకు సమాధానాలు రాయనవసరం లేదని యూపీఎస్‌సీ చెప్పిన విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. మీ ఇబ్బందులు తొలగడం వల్ల మీకు కూడా మంచి అవకాశాలున్నాయని పిటిషనర్‌కు చెప్పింది. సైన్స్, మెడిసిన్ వైపు వెళ్లే విద్యార్థులు తెలివైన వాళ్లు కాబట్టే.. ఇతర సబ్జెక్టులను నుంచి వచ్చేవారి కన్నా వారెక్కువ ప్రతిభ కనబరుస్తారని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. విద్యావిషయాలపై నిర్ణయాన్ని ప్రభుత్వానికి, నిపుణులకు విడిచిపెట్టాలని ధర్మాసనం తెలిపింది. కోర్టును ఇంత ఆలస్యంగా ఎందుకు ఆశ్రయించారని, తొమ్మిది లక్షల మంది సన్నద్ధమైన ఈ పరీక్షకు ఒక్కరు సిద్ధం కాకపోతే చేయగలిగేదేముందని ధర్మాసనం అంగేష్‌ను ప్రశ్నించింది. పిటిషన్‌లో యోగ్యతలు లేవంటూ దానిని సుప్రీం కోర్టు కొట్టివేిసింది.