
న్యూఢిల్లీ: కేసుల విచారణ సందర్భంగా పరిగణనలోకి తీసుకునే ఎలక్ట్రానిక్ ఆధారాలకు ధ్రువీకరణ తప్పనిసరి కాదని, న్యాయబద్ధంగా ఉందని కోర్టులు భావిస్తే విశ్వాసంలోకి తీసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లోని 65బీపై ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన వివరణ కోర్టుల్లో నేర విచారణ తీరుపై ప్రభావం చూపనుంది. దీంతో సీడీలు, మొబైల్ వీడియో రికార్డులు, ఫోన్ కాల్‌డేటా, సీసీటీవీ ఫుటేజీల వంటి ఎలక్ట్రానిక్ రుజువులను కోర్టులు ప్రభుత్వ అధికారి ధ్రువీకరణ లేకున్నా పరిశీలించవచ్చు. అయితే, ఈ రికార్డులను సమర్పించే వ్యక్తి బాధ్యతాయుత పదవిలో ఉన్న అధికారై ఉండాలని జస్టిస్ ఏకే గోయెల్, జస్టిస్ యు.యు.లలిత్‌ల బెంచ్ పేర్కొంది.