పట్టాలెక్కిన గతిమాన్ ఎక్స్‌ప్రెస్
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే రైలు 'గతిమాన్ ఎక్స్‌ప్రెస్' పట్టాలెక్కింది. మంగళవారం ఉదయం రైల్వే మంత్రి సురేష్ ప్రభు జెండా ఊపి రైలును ప్రారంభించారు. దేశంలో 160 కిలోమీటర్ల వేగంతో నడిచే మొట్టమొదటి రైలు ఇది. ఈ తొలి హైస్పీడు రైలు ఢిల్లీ, ఆగ్రాల మధ్య పరుగులు పెడుతోంది. గతిమాన్ ఎక్స్‌ప్రెస్ హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ నుంచి ఆగ్రా స్టేషన్ మధ్య గల 184 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 100 నిముషాల్లో చేరుకోనుంది.
ఉదయం 10 గంటలకు ఢిల్లీ నిజాముద్దీన్ రైల్వేస్టేషన్‌లో బయలుదేరి, 11:40 నిమిషాలకు ఆగ్రా కంటోన్మెంట్ రైల్వేస్టేషన్ చేరుకుంటుంది. గతిమన్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం తప్ప మిగితా అన్ని రోజులు అందుబాటులో ఉంటుంది. దీంతో 28 ఏళ్ల తర్వాత భారతీయ రైల్వే తన అత్యధిక వేగమైన రికార్డును తిరగరాసినట్లు అయింది. కాగా ప్రస్తుతం గంటకు 150 కిలోమీటర్ల వేగంతో భోపాల్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ నడుస్తున్నది.
గతిమాన్ ఎక్స్ప్రెస్ రైలులో ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ ఫైర్ అలారమ్, జీపీఎస్ బేస్డ్ పాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, కోచ్లకు స్లైడింగ్ డోర్లతో పాటు ప్రయాణికులకు సమాచారం, వినోదం అందించేందుకు టీవీలు కూడా అందుబాటులో ఉన్నాయి. రైల్వే బడ్జెట్లో పేర్కొన్న విధంగా ఈ రైలులో విమాన సర్వీసులకు దీటుగా ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.