సుష్మాజీ! నాకూ పాస్‌పోర్టు ఇప్పించండి ప్లీజ్!
న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫిక్సింగ్ కుంభకోణంలో దేశం విడిచి పారిపోయిన లలిత్ మోదీకి బ్రిటన్ ప్రభుత్వం నుంచి ట్రావెల్ డాక్యుమెంట్లను ఇప్పించడంలో మానవతా హృదయంతో సహాయం చేసిన కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, తన పాస్‌పోర్టును పునరుద్ధరించడంలో కూడా అదే మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కూడంకుళం అణు విద్యుత్ వ్యతిరేక ఆందోళనకారుడు ఎస్పీ విజయ్‌కుమార్ వేడుకుంటున్నారు. ఈ మేరకు సుష్మను ఉద్దేశించిన ఆయన రాసిన లేఖను ఆయన తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు.
‘సుష్మాజీ! అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో పని చేస్తూ జీవిస్తున్న నేను 2011లో తమిళనాడుకు వచ్చి కూడంకుళం వచ్చి అణు విద్యుత్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నాను. నాతోపాటు 500 మందిపై తమిళనాడు ప్రభుత్వం కేసులు పెట్టింది. నాతోపాటు వారందరిని పాస్‌పోర్టులను భారత ప్రభుత్వం రద్దు చేసింది. కూడంకుళం పనులను జయలలిత నిలిపివేయడంతో మా ఉద్యమం కూడా నిలిచిపోయింది. అప్పటి నుంచి మాపై కేసులు ఎత్తివేయలేదు. అలాగని విచారణ జరపడం లేదు. మా పాస్‌పోర్టులూ పునరుద్ధరించలేదు. నేను ఇప్పుడు అమెరికా వెళ్లి నా ఆకాడమిక్ కెరీర్‌ను మళ్లీ ప్రారంభించాలనుకుంటున్నాను. నేను వృద్ధాప్యంతో బాధ పడుతున్న తల్లిదండ్రులను, భార్య, ఇద్దరు పిల్లలను పోషించాల్సిన బాధ్యత నామీద ఉంది. మోదీపై చూపినంత మానవతా దృక్పథమంతా కాకపోయినా, కాస్త కరుణతోనైనా నా పాస్‌పోర్టును పునరుద్ధరించండి. ప్లీజ్!’ అని ఆ లేఖలో విజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
అమెరికాలోని హవాయ్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్‌లో పీహెచ్‌డీ చేసిన ఆయన అమెరికాలో టీచింగ్ కెరీర్‌ను వదిలేసుకొని ఉద్యమం కోసమే భారత్ వచ్చారు. 2011 నుంచి ఆయనే తమిళనాడులో అణు వ్యతిరేక ఉద్యమానికి కోఆర్డినేటర్‌గా పనిచేస్తూ వచ్చారు. ఆ ఉద్యమం కారణంగానే అదే ఏడాది కూడంకుళం ప్లాంట్ నిర్మాణం ఆగిపోయింది. ఉద్యమం కూడా చల్లబడింది. 2012లో మళ్లీ ఆ ప్లాంట్‌లోని ఓ యూనిట్ నిర్మాణం ప్రారంభమైంది. ఉద్యమాన్ని తిరిగి ప్రారంభించిన అది ముందున్నంత ఉధృతంగా సాగలేదు. ఫలితంగా కూడంకుళంలోని తొలి విద్యుత్ యూనిట్ ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. ఈలోగా బ్రిటన్‌లో తలదాచుకున్న లలిత్ మోదీకి పోర్చుగల్ వెళ్లేందుకు మానవతా హృదయంతో సుష్మా స్వరాజ్ సహాయం చేశారని తెలిసి ఆయన సుష్మ పేరిట ఫేస్‌బుక్ పేజీలో లేఖ రాశారు. నిజంగా ఆయన అమెరికా పోవాలని కోరుకుంటున్నారా లేక కేంద్ర రాజకీయలను దృష్టిలో ఉంచుకొని వ్యూహాత్మకంగా ఈ లేఖ రాశారా ? అన్నది స్పష్టం కావడం లేదు.