
సుష్మాస్వరాజ్: అద్భుతమైన వక్త
న్యూఢిల్లీ: సుష్మాస్వరాజ్(62).. అద్భుతమైన వక్త. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా ప్రసంగించగల వాగ్ధాటి ఆమె సొంతం. లోక్‌సభ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా, ఆ తరువాత ప్రధాని అభ్యర్థిగా మోడీని ప్రకటించడాన్ని గట్టిగా వ్యతిరేకించిన వారిలో ఒకరు. అద్వానీకి అనుంగు శిష్యురాలు. అయితే, పార్టీలో ఆమెకున్న పట్టు, పరిపాలనలోని శక్తి సామర్ధ్యాలు సుషాస్వరాజ్‌కు మంత్రివర్గంలో స్థానం కల్పించక తప్పని పరిస్థితి కల్పించాయి. ఆర్‌ఎస్‌ఎస్ అగ్రనాయకత్వంలోనూ ఆమెపై మంచి అభిప్రాయమే ఉంది.
ఇటలీలో జన్మించిన సోనియాగాంధీ ఈ దేశ ప్రధాని అయితే, గుండు కొట్టించుకుంటానంటూ 2004లో ఆమె చేసిన ప్రతిజ్ఞ అప్పట్లో సంచలనం సృష్టించడంతో పాటు, జాతీయ వాదుల్లో ఆమెపై అభిమానం పెంపొందింపజేసింది. 1999 ఎన్నికల్లో బళ్లారి స్థానంలో సోనియాగాంధీపై పోటీ చేసిన సమయంలో కన్నడ భాష కూడా నేర్చుకున్నారు. సుష్మాస్వరాజ్ 7 సార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో ఆమె విదిశ నుంచి విజయం సాధించారు. సుష్మా ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త కూతురు. విద్యార్థి దశలోనే ఏబీవీపీలో పనిచేశారు. 1977లో హ ర్యానా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 25 ఏళ్ల వయసులోనే దేవీలాల్ మంత్రివర్గంలో చేరి అత్యంత చిన్నవయసులో మంత్రి అయిన ఘనత సాధించారు. 27 ఏళ్ల వయసులోనే జనతాపార్టీ హర్యానా అధ్యక్షురాలయ్యారు. 1998లో ఢిల్లీకి మొదటి మహిళా సీఎం అయ్యారు.