భారత్ కు రూ.లక్ష కోట్ల విలువైన బంగారం దిగుమతి
బెర్న్, న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్ నుంచి భారత్ కు భారీగా బంగారం దిగుమతి కావడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంవత్సరం స్విస్ ప్రభుత్వం నుంచి బంగారం ఎగుమతి కోసం వ్యాపారవేత్తలు భారీగా అనుమతులు కోరడం అనేక సందేహాలకు తావిస్తోంది. 2014లో స్విట్జర్లాండ్ నుంచి భారీగా భారత్ కు రూ. లక్ష కోట్ల బంగారం దిగుమతి కావడం ఇందుకు ప్రధాన కారణం. స్విస్ కస్టమ్స్ పరిపాలన విభాగం తాజాగా విడుదల చేసిన నివేదికలో పలువిషయాలు వెల్లడయ్యాయి.
ఈ ఒక్క ఏడాదిలోనే స్విట్జర్లాండ్ నుంచి రూ.లక్ష కోట్ల బంగారం భారత్ కు దిగుమతి కాగా, అక్టోబర్ లో రూ. 18 వేల కోట్ల విలువైన బంగారం దిగుమతులు జరిగినట్లు ఆ నివేదికలో స్పష్టమైంది. దీంతో బంగారం రూపంలో నల్లధనాన్ని తిరిగి భారత్ కు తరలిస్తున్నారంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.