
జోధ్‌పూర్ : దేశమంతా శ్రీరామ నవమి రోజు రామున్ని పూజిస్తుంటే, కొంతమంది మాత్రం ఓ నేరస్థుడ్ని రామునిలా కొలుస్తూ వేడుకను జరుపుకున్నారు. గత ఏడాది రాజస్థాన్‌లో జరిగిన లవ్ జిహాద్ హత్య సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. అఫ్రజుల్ అనే వ్యక్తిని దారుణంగా హత మార్చిన శంభు లాల్ ప్రస్తుతం జోధ్‌పూర్ జైల్లో ఉన్నాడు.
(మనిషిని చితక్కొట్టి.. సజీవ దహనం..!)
అయితే ఓ వ్యక్తిని శంభు లాల్ వేషధారణతో రథంపై కూర్చోబెట్టి జోధ్‌పూర్‌లో శివసేన ర్యాలీ నిర్వహించింది. సదరు వ్యక్తి చేతిలో అఫ్రజుల్‌ని చంపడానికి వినియోగించిన గోడ్డలిని కూడా ఉంచడంతో పాటు, దారి పొడవునా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిపై ‘హిందు మిత్రులారా మేల్కొండి. మీ ఆడబిడ్డలను కాపాడుకోండి. దేశానికి లవ్ జిహాద్ నుంచి విముక్తి కల్పించండి’ అని రాసి ఉంది.
శంభు లాల్‌కు మద్ధతు తెలిపేందుకే ఈ ర్యాలీ నిర్వహించినట్లు శివసేన నేత హరి సింగ్ పన్వార్ తెలిపారు. ‘హిందుత్వంపై అతని నిబద్ధత నాలో స్ఫూర్తిని రగిల్చింది. అయితే ఎవరి మనోభావాలను దెబ్బతీయటం ఈ యాత్ర ఉద్దేశం కాదు’ అని పన్వార్ తెలిపారు. ఇక ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తటంతో జోధ్‌పూర్ డీసీపీ స్పందించారు. ఈ విషయం మీడియా ద్వారానే తెలుసుకున్నామని.. ఎవరూ ఫిర్యాదు చేయలేదని.. చేస్తే మాత్రం చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment