సాక్షి, న్యూఢిల్లీ : 22 ఏళ్ల తబ్రేజ్ అన్సారీ మూక హత్య కేసులో 11 మంది నిందితులపై హత్యారోపణలను జార్ఖండ్ పోలీసులు మంగళవారం అనూహ్యంగా కొట్టివేసిన విషయం తెల్సిందే. అన్సారీ దెబ్బల మూలంగా కాకుండా గుండెపోటుతో మరణించినట్లు ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. అప్పట్లో వెలువడిన వార్తల ప్రకారం సెరాయ్‌కెలా–ఖర్సావన్ జిల్లా ధక్తీదీహ్ గ్రామంలో జూన్ నెలలో తబ్రేజ్ అన్సారీపై అల్లరి మూక దాడి చేసింది. ‘జై శ్రీరామ్’ అనాలంటూ ఆ యువకుడిపై ఒత్తిడి తీసుకొచ్చింది. అందుకు అతడు నిరాకరించడంతో ... ఓ చెట్టుకు కట్టేసి చితక్కొట్టారు. ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేసినప్పటికీ అల్లరి మూక వదిలి పెట్టకపోవడంతో అన్సారీ తీవ్రంగా గాయపడ్డారు.
మొదటి నుంచి ఈ కేసు దర్యాప్తులో పోలీసుల అలసత్వం ఎక్కువగా కనిపిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తీవ్రంగా గాయపడిన అన్సారీని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించకపోగా ఆయనపైనే చోరీ కేసును దాఖలు చేసి జుడీషియల్ కస్టడీకి తరలించారు. నాలుగు రోజుల తర్వాత అన్సారీని ఆస్పత్రికి తరలించగా ఆక్కడ ఆయన చనిపోయారు. ‘తలకు బలమైన దెబ్బ తగలడం వల్ల మెదడులోని రక్తనాళాలు చిట్లి (బెయిన్ హెమరేజ్) అన్సారీ మరణించారు’ అంటూ ఆరోజు అటాప్సీ నిర్వహించిన వైద్యులు మీడియాకు స్పష్టంగా చెప్పారు.
ఈ నేపథ్యంలో అన్సారీని కట్టేసి చితకబాదిన 11 మంది నిందితులపై పోలీసులు ఐపీసీ 302 సెక్షన్ కింద హత్య కేసును నమోదు చేశారు. ఆ తర్వాత అన్సారీని హత్య చేయాలనే ఉద్దేశం నిందితులకు ఏ కోశానా లేదని, అనుకోని పరిస్థితులు ఆయన హత్యకు దారి తీశాయంటూ పోలీసులు, నిందితులపై 302 సెక్షన్‌ను తొలగించి 304 సెక్షన్‌ను నమోదు చేశారు. ఆ తర్వాత దాదాపు మూడు నెలలపాటు కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతి కనిపించ లేదు. మెడికల్ బోర్డు తుది ఫోరెన్సిక్ నివేదికలో గుండెపోటు కారణంగా అన్సారీ మరణించారని ధ్రువీకరించినందున నిందితులపై 304 సెక్షన్‌ను కూడా కొట్టి వేస్తున్నామని జార్ఖండ్ పోలీసులు మంగళవారం ప్రకటించారు.
మూకుమ్మడిగా బాధితుడిపై దాడి చేసిన నిందితులపై కేసు దాఖలు చేయాల్సిన పోలీసులు, బాధితుడిపైనే చోరీ కేసును నమోదు చేయడం, తలకు బలమైన దెబ్బతగలడం వల్ల మెదడులో రక్తస్రావంతో అన్సారీ మరణించారని తొలుత వైద్యులు మీడియాకు చెప్పడం, అది ప్రాథమిక నివేదిక మాత్రమేనని, తుది నివేదిక వెలువడాల్సి ఉందని మెడికల్ బోర్డు ఆ తర్వాత ప్రకటించడం, తుది నివేదిక మూడు నెలల ఆలస్యంగా రావడం, వచ్చీ రాగానే నిందితులపై 304 సెక్షన్ కింద హత్యా (దారితీసిన) ఆరోపణలను కొట్టివేస్తున్నట్లు పోలీసులు వెంటనే ప్రకటించడంలో ఆంతర్యం ఏమిటీ ?
ఇందులో అనుమానాలకు ఎలాంటి అవకాశం లేదా ? పోలీసులు, మెడికల్ బోర్డు చెబుతున్నట్లుగా బాధితుడు గుండెపోటుతోనే మరణించాడని అనుకుందాం. అయితే అన్సారీని చెట్టుకు కట్టేసి కొట్టినందుకు వారిని ఐపీసీలోని ఏ సెక్షన్ కింద విచారించలేరా ? ఎలాంటి శిక్ష విధించలేరా ? అల్లరి మూక కొట్టడం వల్ల మానసిక ఒత్తిడికి గురై అన్సారీ గుండెపోటు వచ్చి మరణించి ఉండవచ్చుగదా! ఆ దిశగా కూడా దర్యాప్తు జరపొచ్చుగదా! లేదా గుండెపోటును స్వయంకతాపరాధం కింద పరిగణించి ఏ శిక్ష విధించకుండా నిందితులను వదిలేస్తారా ?
ఇలాంటి మూక హత్య కేసులకు సంబంధించి సుప్రీం కోర్టు 2018, జూలై 17వ తేదీన 11 స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. మూక హత్యలపై ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసి విచారణను త్వరితగతిన ముగించడంతోపాటు ఇలాంటి మూక హత్యలు జరుగకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలను కూడా సుప్రీం కోర్టు సూచించింది. మూక హత్యలకు అవకాశం ఉన్న ప్రతి జిల్లాకు ఓ నోడల్ అధికారిని నియమించాలని, ఆ అధికారి జిల్లా, తాలూకా, గ్రామస్థాయి పరిస్థితులను రాష్ట్ర డిజీపీకి ఎప్పటికప్పడు పరిస్థితి వివరించాలని, రాష్ట్ర డీజీపీ మూక హత్యల నిరోధానికి తగిన చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాలను సూచించింది.
మరి, జార్ఖండ్‌లో ఇలాంటి ముందస్తు నిరోధక చర్యలు తీసుకున్నారా ? సుప్రీం కోర్టు మార్గదర్శకాల గురించి అక్కడి పోలీసులకు తెలుసునా ? తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం మనోగతానికి విరుద్ధంగా వ్యవహరించలేమంటూ వదిలేశారా ? 302 సెక్షన్ కింద నిందితులకు మరణ శిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉండింది. అదే 304 సెక్షన్ కింది నిందితులకు పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉండింది. మరి నిందితులను ఇప్పుడు ఏ సెక్షన్ కింద విచారిస్తారు? మూక హత్యల నివారణకు మణిపూర్‌లోలాగా ‘ప్రత్యేక చట్టం’ ఉండి ఉంటే ఆ చట్టం కింద విచారించే అవకాశం ఉండేది. ఒకే వేళ ఉన్న పాలకపక్షానికి విరుద్ధంగా కేసులను దర్యాప్తు చేసే దమ్మూ ధైర్యం జార్ఖండ్ పోలీసులకు ఉందో, లేదో!?
Comments
Please login to add a commentAdd a comment