
తాజ్‌మహల్
న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాత తాజ్‌మహల్ సందర్శకులపై భారీగా ఫీజు భారం పడనుంది. ఎంట్రీ ఫీజును ప్రస్తుతం ఉన్న రూ.40 నుంచి రూ.50కి పెంచటంతోపాటు తాజ్‌మహల్ లోపల చూడాలనుకున్న వారి నుంచి ప్రత్యేకంగా రూ.200 వసూలు చేయనున్నారు. పెంచిన చార్జీలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ఉత్తరప్రదేశ్ సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ తెలిపారు. రూ.50 ప్రవేశ టికెట్ మూడు గంటలపాటు మాత్రమే చెల్లుబాటవుతుందని ఆయన చెప్పారు. రూ.1,250 చెల్లించే విదేశీ పర్యాటకులు సులువుగా సందర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
చారిత్రక కట్టడాన్ని పరిరక్షించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. ఇందులో భాగంగానే టికెట్ ధరలు పెంచామని, ఆసక్తి ఉన్నవారే సందర్శనకు వచ్చే అవకాశముందన్నారు. దళారుల బెడద తగ్గించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. 1632లో నిర్మించిన తాజ్‌మహల్ లోపల మొఘల్ చక్రవర్తి షాజహాన్, ఆయన భార్య ముంతాజ్ సమాధులున్నాయి. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ను యునెస్కో 1983లో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది.