ఫేజ్‌ 2 @96 కూటముల కోలాటం | Tamil Nadu has the highest Lok Sabha seat in the south | Sakshi
Sakshi News home page

ఫేజ్‌ 2 @96 కూటముల కోలాటం

Published Wed, Apr 17 2019 5:20 AM | Last Updated on Wed, Apr 17 2019 7:47 AM

Tamil Nadu has the highest Lok Sabha seat in the south - Sakshi

ఏడు దశల పోలింగ్‌లో రెండో దశ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. తొలి ఘట్టంలో 91 స్థానాలకు పోలింగ్‌ జరగ్గా.. రెండో దశలో అంత కంటే కొంచెం ఎక్కువ అంటే.. 96 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్‌జరగనుంది. మొన్న 11న జరిగిన తొలిదశ పోలింగ్‌ శాతాన్ని బట్టి(తెలంగాణలో 8 శాతం, ఉత్తరాఖండ్‌లో నాలుగు శాతం తక్కువ)బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని.. మరోసారి అధికారం చేపట్టడం కల్ల అని కొందరు ఇప్పటికే లెక్కలు వేసినా.. వాస్తవం ఏమిటో తేలేది మే 23న మాత్రమే. ఏదెలా ఉన్నప్పటికీ రెండో దశ ఎన్నికలు మొత్తం కూటముల కుప్ప అని స్పష్టమవుతోంది. రాష్ట్రాల వారీగా ఇదీ పరిస్థితి.. 

తమిళనాట కుంపట్ల మంట 
దక్షిణాదిలో అత్యధిక లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రం తమిళనాడు. గత ఎన్నికల్లో నాలుగు కూటములు హోరాహోరీగా తలపడ్డాయిక్కడ. ఏఐఏడీఎంకే ఒకవైపు.. డీఎంకే, ఐయూఎంఎల్, వీసీకే ఒక కూటమి గా, బీజేపీ, డీఎండీకే, పీఎంకే, ఐజేకే, పీఎన్‌కే మరో కూటమిగా.. కాంగ్రెస్, వామపక్షాలు ఇంకో కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగాయి. దేశవ్యాప్తంగా వీచిన మోదీ హవాను అడ్డుకుని మరీ ఏఐఏడీఎంకే విజేతగా నిలిచింది. 39 స్థానాల్లో 44 శాతం ఓట్లు పోగేసుకుని 37 సీట్లు సాధించింది. మిగిలిన రెండింటినీ బీజేపీ, పీఎంకే పంచుకున్నాయి. రెండేళ్ల తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఏఐఏడీఎంకే విజయఢంకా మోగించగా.. ఆ తరువాత కొద్దికాలానికే జయలలిత, కరుణానిధి కన్నుమూశారు.

రాజకీయ శక్తుల పునరేకీకరణకూ ఆస్కారం కలిగింది. డీఎంకే పగ్గాలు కరుణ కుమారుడు ఎంకే స్టాలిన్‌కు దక్కగా.. ఏఐఏడీఎంకే వారసత్వం మాత్రం గందరగోళానికి దారితీసి, పార్టీ రెండు ముక్కులయ్యేలా చేసింది. ఎట్టకేలకు అధికార పంపిణీపై రాజీ కుదిరిన తరువాత కె.పళనిస్వామి, ఓపీఎస్‌ పన్నీర్‌ సెల్వమ్‌ వర్గాలు రెండూ ఒక్కటయ్యాయి. మరోవైపు జయలలిత సమీప బంధువు టీటీవీ దినకరన్‌ 18 మంది ఎమ్మెల్యేలతో అమ్మ మక్కళ్‌ మున్నేట్ర కజగం పేరుతో సొంత కుంపటి పెట్టారు. ఈ లోక్‌సభ ఎన్నికల తరువాత త్వరలో జరిగే 22 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు అటు దినకరన్‌ పార్టీకి, ఇటు ఏఐఏడీఎంకే మనుగడకూ కీలకంగా మారాయి.

బరిలో నాలుగు కూటములు 
2019 ఎన్నికల్లోనూ తమిళనాట చతుర్ముఖ పోటీ నెలకొంది. ఏఐఏడీఎంకే కాస్తా ఎన్డీయే పక్షాన చేరిపోగా.. డీఎంకే యూపీఏ వైపు నిలిచింది. సినీ నటుడు కమల్‌హాసన్‌ పార్టీ మక్కళ్‌ నీది మయ్యమ్, దినకరన్‌ పార్టీ కూడా బరిలో నిలిచాయి. ఏఐఏడీఎంకే 20 స్థానాల్లో పోటీ చేస్తుండగా, భాగస్వామ్య పక్షాలైన పీఎంకే (7), బీజేపీ (5), డీఎండీకే (4), తమిళ మానీల కాంగ్రెస్, తమిజగం కచ్చి, పుదియ నీది కచ్చి ఒక్కో సీటుకు పోటీ పడుతున్నాయి. పుదుచ్చేరి నుంచి మరో భాగస్వామ్య పార్టీ ఏఐఎన్‌ఆర్‌సీ పోటీ చేస్తోంది. మరోవైపు యూపీఏ కూటమిలో డీఎంకే 20, కాంగ్రెస్‌ 9 స్థానాల్లోనూ పోటీ చేస్తుండగా వీసీకే (2), సీపీఐ, సీపీఎం, ఎండీఎంకే, ఐజేకే, కేఎండీకే, ఐయూఎంఎల్‌ ఒక్కో స్థానంలో పోటీలో ఉన్నాయి. డీఎంకే, ఏఐఏడీఎంకే 8 చోట్ల ముఖాముఖి తలపడుతున్నాయి. కాగా వేలూరు లోక్‌సభ ఎన్నిక చివరి నిమిషంలో వాయిదా పడింది. 

స్థానికాంశాలే ప్రచారాస్త్రాలు..
తమిళనాట ఎన్నికలు ప్రధానంగా స్థానిక అంశాల ఆధారంగానే జరుగుతుంటాయి. చిరకాలంగా అపరిష్కృతంగా ఉన్న కావేరీ నదీ జలాల వివాదంతోపాటు తూతుక్కుడిలో స్టెరిలైట్‌ కాపర్‌ స్మెల్టింగ్‌ ప్లాంట్‌ మూసివేత ఆందోళనలో జరిగిన కాల్పులు ప్రధానాంశాలుగా మారాయి. సేలమ్‌ –చెన్నై గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణంపై పర్యావరణ వేత్తల నుంచి వస్తున్న అభ్యంతరాలు ఎన్నికలపై ప్రభావం చూపవచ్చు. ఈ ఏడాది జరిగిన ప్రపంచ పెట్టుబడుల సదస్సు, గాజా తుపాను విపత్తును సమర్థంగా ఎదుర్కోవడం, మదురైకు ఎయిమ్స్‌ రావడాన్ని తమ విజయాలుగా ఏఐఏడీఎంకే చెబుతోంటే.. సంక్షేమ పథకాల అమలులో వైఫల్యాలు.

 పరిపాలన కుంటుపడటాన్ని డీఎంకే ఎత్తి చూపుతోంది. అధికార పార్టీకి మంచి పట్టున్న దక్షిణ తమిళనాడు ప్రాంతంలో దీపావళి టపాకాయల ఫ్యాక్టరీలపై సుప్రీంకోర్టు కొరడా ఝళిపించడంతో వేలాది మంది ఉపాధి కోల్పోగా 2017లో వచ్చిన ఓఖీ తుపాను కారణంగా 191 మంది జాలర్లు మరణించడం ఏఐఏడీఎంకే వైఫల్యాలుగా చూపుతోంది. అన్నిటినీ పరిశీలించిన తరువాత తమిళనాట ఈ దఫా ఎన్నికల్లో డీఎంకేకు ఎక్కువ సీట్లు దక్కవచ్చునని అంచనా. అయితే ఇవి 2004 నాటి స్థాయిలో ఉండవు. ఏఐఏడీఎంకే ఎన్డీయే కూటమి ప్రభావం ఉంటుంది. ఏఐఏడీఎంకే రెండంకెల స్థానాలు కైవశం చేసుకోవచ్చు. 

కీలక నియోజకవర్గాలు:
చెన్నై సెంట్రల్‌: దయానిధి మారన్‌ (డీఎంకే)    
ధర్మపురి: సిట్టింగ్‌ ఎంపీ అన్బుమణి రామ్‌దాస్‌ పోటీ చేస్తున్నారు. 
నీలగిరీస్‌ (ఎస్సీ): బడగ (ఎస్టీ), అరుంధరియార్లు, వెల్లలా గౌండర్లు (ఓబీసీ) పెద్దసంఖ్యలో గల ఈ స్థానంలో ఏ.రాజా పోటీ చేస్తున్నారు. 
కోయంబత్తూరు: బీజేపీ, సీపీఎం మధ్య ఇక్కడ ప్రత్యక్ష పోరు నెలకొంది.
శివగంగ: కార్తి (కాంగ్రెస్‌)–హెచ్‌.రాజ (బీజేపీ) పోటీలో ఉన్నారు. 
తూతుక్కుడి: కరుణానిధి కుమార్తె కనిమొళి (డీఎంకే), తమిళసాయి సౌందరరాజన్‌ (బీజేపీ) పోటీ పడుతున్న స్థానమిది.     
కన్యాకుమారి: పొన్‌ రాధాకృష్ణన్‌ (బీజేపీ), హెచ్‌.వసంతకుమార్‌ (కాంగ్రెస్‌) మధ్య ప్రత్యక్ష పోరు.. హిందువులు, క్రిస్టియన్లు సమానంగా ఉన్నారిక్కడ. 

 మహారాష్ట్రలో ఎవరు ‘పది’లం?
మహారాష్ట్రలో పది లోక్‌సభ స్థానాలకు గురువారం పోలింగ్‌ జరగనుంది. ఈ పది స్థానాల్లో.. గత ఎన్నికల్లో బీజేపీ, శివసేన తలో నాలుగు సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్‌ రెండు స్థానాల్లో విజేతగా నిలిచింది.

ప్రభావం చూపే అంశాలివే.. 
►కరువుకు మారుపేరుగా నిలిచే మరాఠ్వాడ ప్రాంతంలో వ్యవసాయ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు ఈ ఎన్నికల్లో కీలకాంశాలుగా మారాయి.

►వ్యవసాయ సంక్షోభం, తాగునీటి లభ్యత, నిరుద్యోగం, పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి వాటిని కాంగ్రెస్, వీబీఏ ప్రచారాస్త్రాలుగా మార్చుకున్నాయి. 
పోటీ.. నువ్వా?నేనా?

►బీజేపీ నేత ప్రీతమ్‌ ముండే పోటీ చేస్తున్న బీడ్‌ నియోజకవర్గంలో పోటీ ఉత్కంఠ కలిగిస్తోంది.

►దశాబ్దాలుగా కాంగ్రెస్‌ కంచుకోటగా ఉన్న లాతూర్‌లో మచ్చీంద్ర కామత్‌.. సుధాకర్‌ శ్రాంగరే (బీజేపీ) మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. వారానికి ఒక్కసారి మాత్రమే తాగునీరు దొరికే లాతూర్‌లో నీటి లభ్యతే ముఖ్యమైన ఎన్నికల అంశం.

►షోలాపూర్‌లో కేంద్ర మాజీ మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే (కాంగ్రెస్‌), లింగాయత్‌ వర్గ మఠాధిపతి మహాస్వామి జై సిద్ధేశ్వర్‌ శివాచార్య (బీజేపీ), అంబేడ్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ (వీబీఏ) మధ్య ఆసక్తికరమైన పోటీ నెలకొంది. దాదాపు నాలుగు లక్షల ఓట్లు ఉన్న లింగాయత్‌లు తమ విజయానికి అక్కరకొస్తారని బీజేపీ ఆశిస్తుండగా మూడు లక్షల మంది ధంగర్లు, 2.50 లక్షల ముస్లింలను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ ప్రయత్నిస్తున్నారు. 

ఎన్నికలు జరిగే స్థానాలు:
విదర్భ ప్రాంతంలోని బుల్దానా, అకోలా, అమ్రావతి (ఎస్సీ), మరాఠ్వాడ ప్రాంతంలోని హింగోలి, నాందేడ్, పర్బని, బీడ్, ఒస్మానాబాద్, లాతూర్, రాష్ట్ర పశ్చిమ ప్రాంతంలోని షోలాపూర్‌. 

‘ఉత్తరాది’ వస్తాదులెవరో?
దేశంలోనే అతి ఎక్కువ లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో గురువారం రెండో దశ పోలింగ్‌ జరగనుంది. ఎనిమిది స్థానాలకు పోలింగ్‌ జరగనుండగా, గత ఎన్నికల్లో ఈ ఎనిమిదింటినీ బీజేపీ గెలుచుకుంది. బాలాకోట్‌ దాడుల తరువాత జరుగుతున్న ఈ ఎన్నికలు కాషాయ పార్టీకి మేలు చేసే అవకాశాలున్నాయి. అయితే ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌ఎల్‌డీ పొత్తు, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదన్న కాంగ్రెస్‌ విమర్శల నేపథ్యంలో యూపీ ఎన్నికలు మతం రంగు పులుముకున్నాయి. ముస్లింలు అందరూ తమ సెక్యులర్‌ కూటమికి ఓటేయాలన్న బీఎస్పీ అధినేత్రి మాయావతి పిలుపు విమర్శలకు తావిచ్చింది. మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ‘అలీ వర్సెస్‌ బజరంగభళి’ వ్యాఖ్య.. ఎన్నికల కమిషన్‌ ఆయనపై మూడు రోజుల ప్రచార నిషేధాన్ని ప్రకటించేందుకు కారణమైన విషయం తెలిసిందే. మతాల ప్రాతిపదికన జరుగుతున్న ఈ ఎన్నికలు కూటమి లెక్కలను తారుమారు చేసే అవకాశముంది. అలాగే, ఈ ఎనిమిది స్థానాల్లో బీజేపీ ఈసారి కొన్నిటిని కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. ప్రాంతీయ పార్టీల మధ్య పొత్తులు పనిచేస్తే.. బీజేపీకి నష్టమే.

►అలీగఢ్‌లో బీజేపీ ఎంపీ సతీశ్‌ కుమార్‌ గౌతమ్, బీఎస్పీ అభ్యర్థి అజిత్‌ బలియాన్, కాంగ్రెస్‌ అభ్యర్థి బిజేంద్ర సింగ్‌ మధ్య ముక్కోణపు పోటీ నడుస్తోంది. ఈ నియోజకవర్గంలో ముస్లింలు దాదాపు 20 శాతం మంది ఉన్నారు. అయితే ఇక్కడి నుంచి ముస్లింలు ఎప్పుడూ గెలుపొందకపోవడం గమనార్హం. 2014లో దళిత, జాఠ్, లోధ్‌ సామాజిక వర్గాల మద్దతుతో బీజేపీ అధికారం చేజిక్కించుకుంది. 

►ఆగ్రాలోనూ బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్‌ మధ్య పోటీ ఉండగా.. మథురలో సినీ నటి హేమామాలిని బరిలో ఉన్నారు. 

ఎన్నికలు జరిగే స్థానాలు:
నగీనా (ఎస్సీ), అమ్రోహా, పశ్చిమ యూపీలోని అలీగఢ్, హత్రాస్‌ (ఎస్సీ), మథుర, ఆగ్రా (ఎస్సీ), ఫతేపూర్‌ సిక్రీ, బులంద్‌షహర్‌. 

అస్సాం, బిహార్, ఒడిశా, పశ్చిమబెంగాల్‌..
ఈశాన్య రాష్ట్రమైన అస్సాంతోపాటు బిహార్, ఒడిశాలోనూ రెండో దశ ఎన్నికల్లో భాగంగా ఐదేసి స్థానాలకు ఈ నెల 18న పోలింగ్‌ జరగనుంది. అస్సాంలో.. నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజెన్స్‌ రాకతో ఆ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. 2014 డిసెంబర్‌ 31వ తేదీని కటాఫ్‌గా పెట్టి హిందూ, పార్శీ, బౌద్ధులు, జైన్, సిక్కులను అక్రమ వలసదారులుగా గుర్తించేందుకు ఉద్దేశించిన సిటిజన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ బిల్‌ (2016) కూడా ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశముంది. అనేక ప్రదర్శనలు, ఆందోళనల తరువాత ఇప్పుడు పరిస్థితి సాధారణ స్థితికి చేరుకున్నా ఈ అంశాలు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది. 

►బిహార్‌ తూర్పు ప్రాంతంలోని కిషన్‌గంజ్, కథిహార్, పూర్ణియా, భగల్పూర్, బంకా స్థానాలకు గురువారం పోలింగ్‌ జరగనుంది.

►ఒడిశాలో బార్‌బాగ్, సుందర్‌గఢ్‌ (ఎస్టీ), బోలన్‌గిర్, కాంధమాల్, అస్కా పోలింగ్‌కు సిద్ధమయ్యాయి. 2014లో బీజేడీ నాలుగు, బీజేపీ ఒక స్థానం గెలుచుకున్నాయి. ఈసారి బోలన్‌గిర్, అస్కాలలో బీజేపీ, బీజేడీ మధ్య హోరాహోరీ నడుస్తోంది. 1999 నుంచి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ గెలుస్తూ వస్తున్న అస్కా నియోజకవర్గంలో ఈసారి ఆ పార్టీ సీనియర్‌ రామకృష్ణ పట్నాయక్, కాంగ్రెస్‌ కార్యకర్తల మద్దతుతో రామకృష్ణ పాండా (సీపీఎం) పోటీ చేస్తున్నారు. 

►ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్‌లో మూడేసి స్థానాలకు, జమ్మూ కశ్మీర్‌లో రెండు, మణిçపూర్, త్రిపురలో ఒక్కో స్థానం, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఒక స్థానానికి కూడా గురువారమే పోలింగ్‌ జరగనుంది. 

రక్తి కట్టిస్తోన్న‘కర్ణాటక’ం
కర్ణాటకలో ఈసారి ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. ఈ నెల 18న జరిగే తొలిదశలో రాష్ట్రంలోని మొత్తం 28 నియోజకవర్గాల్లో సగం స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. గత ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్‌ మధ్య ముక్కోణపు పోటీ జరగ్గా మోదీ హవాతో బీజేపీ 17 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్‌ ఎనిమిది, జేడీఎస్‌ రెండు స్థానాలు గెలుపొందాయి. 2004 నుంచి బీజేపీ ఆధిపత్యం సాధిస్తున్న ఈ రాష్ట్రంలో గత ఏడాది తృటిలో అధికారం కోల్పోయింది. ఫలితాలు వెలువడ్డాక కాంగ్రెస్‌ జేడీఎస్‌ జట్టుకట్టడంతో బీజేపీ ప్రతిపక్షంగా నిలవాల్సి వచ్చింది. తాజా ఎన్నికల్లో కుదిరిన ఒప్పందం ప్రకారం కాంగ్రెస్‌ 18 స్థానాల్లోనూ, జేడీఎస్‌ పది స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.

కాంగ్రెస్‌ –జేడీఎస్‌ కూటమి.. రైతు రుణమాఫీ, ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు అధిష్టానానికి డబ్బులిచ్చానన్న బీఎస్‌ యడ్యూరప్ప ఆడియో టేపులు బీజేపీని ఇరుకున పెడుతుండగా.. దేశ భద్రత, దేశభక్తి, నరేంద్ర మోదీ శక్తియుక్తుల ఆధారంగా బీజేపీ ఓట్లు అడుగుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ –జేడీఎస్‌ ఉమ్మడి ఓట్లు పది శాతం వరకూ ఎక్కువగా ఉండటాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఈసారి కూటమికి 17–20 స్థానాలు దక్కాలి. అయితే భాగస్వామి పక్షాల్లోని లుకలుకలు, ఓట్ల బదలాయింపు, కార్యకర్తల మధ్య సమన్వయం తదితర అంశాలన్నీ తుది ఫలితాలపై ప్రభావం చూపనున్నాయి.

►18న జరిగే ఎన్నికల్లో చామరాజ నగర... సినీనటి సుమలత పోటీ చేస్తున్న మండ్య స్థానాలు కీలకంగా ఉన్నాయి. 

►మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్‌ రేవణ్ణ పోటీ చేస్తున్న హాసన్, దేవెగౌడ స్వయంగా బరిలోకి దిగుతున్న తుముకూరు కూడా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. లింగాయతులు, ఒక్కళిగలు సమాన సంఖ్యలో ఉన్న తుముకూరులో సిట్టింగ్‌ ఎంపీ ఎస్‌.పి.ముద్ద హనుమేగౌడ (కాంగ్రెస్‌) తిరుగుబాటు చేయడం దేవెగౌడ గెలుపు అవకాశాలపై ప్రభావం చూపే అవకాశముంది. 

ఎన్నికలు జరిగే స్థానాలు: 
బెంగళూరులోని నాలుగు స్థానాలతో పాటు తీర ప్రాంతంలోని ఉడుపి చిక్కమగళూరు, దక్షిణ కన్నడ స్థానాలు, హాసన్, చిత్రదుర్గ, తుముకూరు, మండ్య, మైసూరు, చామరాజనగరలు, రాష్ట్ర దక్షిణ ప్రాంతంలోని చిక్కబళ్లాపుర, కోలార్‌ స్థానాల్లో పోలింగ్‌ జరగనుంది. 

2014 ఎన్నికల్లో.. ఎవరికెన్ని?
►33 ఎన్డీఏ (బీజేపీ–27, భాగస్వామ్య పార్టీలు–6)

►15యూపీఏ (కాంగ్రెస్‌–12, భాగస్వామ్య పార్టీలు–3)

►02 వామపక్షాలు

►37ఏఐఏడీఎంకే

►10ఇతరులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement