రాష్ట్రాల ఫలితాలు నేర్పుతున్న... ‘జాతీయ’ పాఠాలు | Teach the results ... 'national' lessons | Sakshi
Sakshi News home page

రాష్ట్రాల ఫలితాలు నేర్పుతున్న... ‘జాతీయ’ పాఠాలు

Published Fri, May 20 2016 3:37 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

రాష్ట్రాల ఫలితాలు నేర్పుతున్న... ‘జాతీయ’ పాఠాలు - Sakshi

రాష్ట్రాల ఫలితాలు నేర్పుతున్న... ‘జాతీయ’ పాఠాలు

* దేశవ్యాప్తంగా బలోపేతమవుతున్న బీజేపీ
* తొలిసారిగా ఈశాన్యాన కమలవికాసం
* అంతకంతకూ దిగజారుతున్న కాంగ్రెస్
* బెంగాల్లో అడుగంటుతున్న లెఫ్ట్ ప్రాభవం

సాక్షి, న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జాతీయ స్థాయిలో చోటుచేసుకుంటున్న పలు రాజకీయ పరిణామాలకు అద్దం పట్టాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న దేశవ్యాప్తంగా బీజేపీ నానాటికీ బలోపేతమవుతోందన్న సంకేతాలిచ్చాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పరిస్థితి మరింతగా దిగజారుతున్న తీరుకు, వామపక్షాలు తమ కోటయిన పశ్చిమ బెంగాల్లోనే పూర్తిగా ప్రాభవం కోల్పోతున్న వైనానికి నిదర్శనంగా నిలిచాయి.

ప్రాంతీయ పార్టీల హవాను కూడా మరోసారి కళ్లకు కట్టాయి. జయలలిత నాయకత్వంలోని అన్నాడీఎంకే తమిళనాట అధికారాన్ని నిలబెట్టుకోవడం ద్వారా మూడు దశాబ్దాల రికార్డును బద్దలు కొట్టింది. బెంగాల్లో దీదీ సారథ్యంలోని తృణమూల్ తిరుగులేని విజయంతో అధికారాన్ని నిలుపుకుంది. మరోవైపు అసోంలో విజయఢంకా మోగించడం ద్వారా ఈశాన్య భారతంలో బీజేపీ తొలిసారిగా పాగా వేసింది. కేరళలోనూ బోణీ చేయగలిగింది. బెంగాల్‌లో కొన్ని సీట్లు దక్కించుకుంది.

అసోం, కేరళల్లో అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్, పుదుచ్చేరిలో నామమాత్ర విజయంతో సరిపెట్టుకుంది. బెంగాల్లో దాదాపుగా మట్టికరిచిన సీపీఎంకు కేరళలో ఓదార్పు విజయం దక్కింది.
 
కాంగ్రెస్ ముక్త్ భారత్ దిశగా
గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ సంధించిన ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ నినాదాన్ని నిజం చేసేలా ఆ పార్టీ పనితీరు సాగుతోంది. సార్వత్రిక ఎన్నికలకు ఆరు నెలల ముందు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, ఢి ల్లీల్లో చతికిలపడ్డ కాంగ్రెస్, తర్వాత సార్వత్రిక ఎన్నికల్లోనూ ఘోర పరాజయాన్నే మూటగట్టుకుంది.

కనీసం లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది! కర్నాటక, కొన్ని చిన్న రాష్ట్రాల్లో అధికారానికి పరిమితమైంది. అసలే తన ఉనికి నామమాత్రమైన తమిళనాట డీఎంకేతో పొత్తు కాంగ్రెస్‌కు లాభించలేదు. అసోంలో 15 ఏళ్ల తరుణ్ గొగొయ్ పాలనపై ఏర్పడ్డ ప్రభుత్వ వ్యతిరేక ఓటును అంచనా వేయడంలో, ఆయనకు ప్రత్యామ్యాయ నాయకత్వాన్ని బలోపేతం చేయడంలో పార్టీ విఫలమైంది. కేరళలోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటులో కొట్టుకుపోయింది.

బెంగాల్‌లో వామపక్షాలతో నెయ్యం, కేరళలో కయ్యం మలయాళీలకు రుచించలేదు. ఈ నేపథ్యంలో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్, పంజాబ్‌లతో పాటు తాను అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్, మణిపూర్‌లలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్‌కు అగ్నిపరీక్షే కానున్నాయి. ఏఐసీసీని అధినేత్రి సోనియా గాంధీ త్వరలో పునర్ వ్యవస్థీకరిస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
 
బెంగాల్లో వామపక్షాలది మూడో స్థానమే
పశ్చిమ బెంగాల్‌లో సిద్దాతాలను పక్కకు పెట్టి మరీ బద్ధ శత్రువు కాంగ్రెస్‌తో చేతులు కలిపినా సీపీఎంకు చివరికి మిగిలిందేమీ లేదు! కాంగ్రెస్ 44 సీట్లు గెలుచుకోగా సీపీఎం మరీ 26 సీట్లకే పరిమితమై అప్రతిష్ట మూటగట్టుకుంది. లెఫ్ట్ హయాంలో తమపై జరిగిన దాడులను కాంగ్రెస్ కార్యకర్తలు మర్చిపోలేదని, అందుకే కాంగ్రెస్ వోట్లు సీపీఎంకు బదిలీ కాలేదని ఫలితాలు రుజువు చేస్తున్నాయి.
 
ఈశాన్య భారతానికీ బీజేపీ విస్తరణ
ఈశాన్యభారతంలో తొలిసారిగా అసోంలో బీజేపీ విజయకేతనం ఎగరవేసింది. అయితే ఇదేమీ అకస్మాత్తుగా లభించిన విజయం కాదు. పాతికేళ్లుగా రాష్ట్రంలో ఆర్‌ఎస్‌ఎస్ చేస్తున్న ప్రయత్నాలు ఇలా ఫలించాయి. ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖ నాయకుడు రాం మాధవ్ ఈ ఎన్నికలను పర్యవేక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటునే నమ్ముకోకుండా ఏజీపీ, బోడో పీపుల్స్ ఫ్రంట్‌తో బీజేపీ పొత్తులో కీలకపాత్ర పోషించారు.

బెంగాల్‌లోనూ బీజేపీ ఓట్ల శాతం 4 నుంచి 10.2కు పెరిగింది! పైగా కేరళలోనూ తొలిసారిగా ఒక సీటును బీజేపీ దక్కించుకుంది!
 విజయ గర్వాన్ని తలకెక్కించుకోకుండా, మోదీ ప్రభుత్వం పదేపదే చెబుతున్న ‘కోపరేటివ్ ఫెడరలిజం’ స్ఫూర్తిని సరిగా అమలు చేస్తేనే బీజేపీకి మెరుగైన భవిష్యత్తు ఉంటుందనేందుకు ఈ ఫలితాలు సంకేతంగా నిలిచాయి.

ఇక యూపీలో ఉప ఎన్నికల్లో రెండు స్థానాలనూ ఎస్పీ గెలుచుకోవడం గమనార్హం. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ కేవలం 2,500 ఓట్ల తేడాతో కాంగ్రెస్‌పై కనాకష్టంగా నెగ్గింది! దీన్ని ఒకరకంగా బీజేపీకి హెచ్చరిక సంకేతంగానే చూడాలన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కీలకమైన ఉత్తరప్రదేశ్. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను ఆ పార్టీ ఎలా ఎదుర్కొంటుందన్నది ఆసక్తికరం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement