సాబీర్ ఆలీ తర్వాత దావూద్ ను చేర్చుకుంటారా?: నఖ్వీ
Published Sat, Mar 29 2014 10:41 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
న్యూఢిల్లీ: బీజేపీలో మొజాహిద్దీన్ టెర్రిరిస్ట్ గ్రూప్ కు చెందిన యాసిన్ భత్కల్ స్నేహితుడు సాబీర్ ఆలీ చేరిక అగ్గి రాజేస్తోంది. బీజేపీలో సాబీర్ ఆలీ చేరికపై మెజార్టీ పార్టీ నేతలు వ్యతిరేకించడం చర్చనీయాంశమైంది. టెర్రిరిస్ట్ భత్కల్ స్నేహితుడు బీజేపీలో చేరాడు. త్వరలో దావుద్ ను కూడా చేర్చుకుంటారేమో అని పార్టీ ఉపాధ్యక్షుడు ముఖ్తర్ అబ్బాస్ నక్వీ వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది. అంతేకాకుండా పార్టీ చేసిన తప్పిదాన్ని సరిదిద్దుకోవాలని నఖ్వీ నిలదీయడం అగ్ర నాయకత్వానికి మింగుడు పడటం లేదు.
సాబీర్ ఆలీని పార్టీలోకి ఆహ్వానించడంపై తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మరో నేత బల్బీర్ పంజ్ సూచించారు. పార్టీ నిర్ణయం లక్షలాది మంది కార్యకర్తల్ని షాక్ గురి చేసిందన్నారు. సాబీర్ ఆలీ లాంటి వ్యక్తులు పార్టీలో చేరడం వలన కార్యకర్తల మనోభావాలు దెబ్బ తింటాయని మరో నేత రామేశ్వర్ చౌరాసియా అన్నారు.
అయితే సాబీర్ పై పెరుగుతున్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ స్పందించారు. కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించాలంటే అందర్ని కలుపుకుపోవాలని ఆయన సూచించారు. కీలక ఎన్నికల సమయంలో సాబీర్ ఆలీ చేరికపై ఇతర పార్టీలు పెద్దగా స్పందించకపోయినా.. బీజేపీ నేతలే వివాదస్పదం చేయడం చర్చనీయాంశమవుతోంది.
Advertisement