బిజెపిలో ముస్లిం నేత చేరిక వాయిదా
బిజెపిలో జనతాదళ్ యునైటెడ్ ఎంపీ సాబిర్ అలీ చేరిక వివాదం రోజుకో ట్విస్టు, గంటకో షాకుగా తయారైంది. తన పై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలు నిగ్గుతేలిన తరువాతే తాను పార్టీలో చేరతానని, అంతవరకూ తన సభ్యత్వాన్ని పెండింగ్ లో పెట్టమని సాబిర్ అలీ బిజెపిని కోరారు.
బిజెపి ముస్లిం నేత ముఖ్తార్ అబ్బాస్ నక్వీ సాబిర్ ను ఇండియన్ ముజాహిదీన్ సానుభూతిపరుడని, ఉగ్రవాది భత్కల్ కి ఆశ్రయం ఇచ్చాడని ఆరోపించారు. ఆ తరువాత బిజెపి నేతలు ఒక్కొక్కరుగా సాబిర్ చేరికపై గళం విప్పారు. అయోధ్య ఉద్యమ నేత వినయ్ కటియార్ కూడా సాబిర్ చేరికను తప్పుపట్టారు.
సాబిర్ మొదటి నుంచీ నరేంద్ర మోడీని గట్టిగా వ్యతిరేకిస్తున్న ముస్లిం నేతలలో ఒకరు. ఆయన ఉన్నట్టుండి మోడీని పొగడటంతో ఆయన్ని జెడీయూ పార్టీనుంచి బహిష్కరించింది. అయితే ఇప్పుడు ఆయన తన చేరికను వాయిదా వేసుకున్నారు.
(బీజేపీ దావూద్‌నూ చేర్చుకుంటుందా?)
అటు హిందూ అతివాది ప్రమోద్ ముతాలిక్ చేరిక, ఇటు ముస్లిం అతివాది సాబిర్ చేరిక విషయంలో భారీ ఎత్తున విమర్శలు రావడంతో బిజెపి ఇరకాటంలో పడింది. రెండు చేరికలూ వాయిదాపడ్డాయి.