మోడీ సభలో చెప్పులు, రాళ్లు
కనీవినీ ఎరుగని రీతిలో జనం రావడంతో బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ గయ బహిరంగ సభలో కాసేపు గందరగోళం నెలకొంది. బీహార్ లోని గయలోని గాంధీమైదాన్ లో జరిగిన సభలో నరేంద్ర మోడీ వేదికపైకి రాగానే జనం బారికేడ్లను తెంచుకుని మరీ ముందుకు చొచ్చుకువచ్చారు. వారిని ఆపేందుకు పోలీసులు లాఠీ చార్జీ చేశారు.
లాఠీచార్జితో జనం మరింత రెచ్చిపోయారు. అప్పటికే నరేంద్ర మోడీ కోసం గంటల పాటు ఎదురుచూస్తున్న ప్రజలు పోలీసులపై విరుచుకుపడ్డారు. చెప్పులు, రాళ్లతో పోలీసులపై దాడి చేశారు. కొందరు లాఠీలతో దూసుకుపోయారు. దీంతో కాసేపు సభలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.
చివరికి బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోడీ ప్రజలను శాంతియుతంగా వ్యవహరించమని కోరారు. కొద్ది సేపటికి సభ సద్దుమణిగింది. ఆ తర్వాత మోడీ ప్రసంగం కొనసాగింది.
గురువారం ఉదయమే గయలో నక్సలైట్లు రెండు టెలిఫోన్ టవర్లను పేల్చివేశారు. దీంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.