ఏ రాష్ట్రంలో ఏదీ కీలకం
ఈ నెల 24న ఎన్నికలు జరిగే 12 రాష్ట్రాల్లో పరిస్థితి ఇదీ..
సార్వత్రిక పర్వంలో ఇప్పటికే ఐదు విడతలు పూర్తయ్యాయి. ఏప్రిల్ 24న ఆరో విడతలో దేశంలోని 12 రాష్ట్రాలకు చెందిన 117 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. పలు విడతల పోలింగ్ జరుగుతున్న పెద్ద రాష్ట్రాల్లో కొన్ని నియోజకవర్గాలకు ఇప్పటికే పోలింగ్ పూర్తయింది. ఆరో విడతలో పోలింగ్ జరగనున్న 12 రాష్ట్రాల్లో ఓటర్లను ప్రభావితం చేయనున్న కీలకాంశాలపై విహంగ వీక్షణం...
ఎలక్షన్ సెల్: అస్సాం చొరబాట్లు... వేర్పాటు నినాదాలు...
భద్రత, బంగ్లా నుంచి చొరబాట్లు, అభివృద్ధి ఇక్కడి ఎన్నికల్లో కీలకాంశాలుగా ఉన్నాయి. అస్సాంలో విపక్షాలైన బీజేపీ, ఏజీపీలు బంగ్లా చొరబాట్లను ప్రధాన ప్రచారాస్త్రంగా వాడుకుంటున్నాయి. బంగ్లాదేశ్ సరిహద్దులను మూసివేయాలని, వేధింపుల పాలైన బంగ్లా బాధితులకు శరణార్థుల హోదా కల్పించాలని బీజేపీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి శంతన్ భరాలీ డిమాండ్ చేస్తున్నారు. బంగ్లా చొరబాట్లకు వ్యతిరేకంగా 1985లో పార్టీ ఏర్పాటైన రెండు నెలల్లోనే అధికారాన్ని హస్తగతం చేసుకోగలిగిన ఏజీపీ కూడా ఈ ఎన్నికల్లో మళ్లీ అదే అంశాన్ని ప్రచారాస్త్రంగా చేసుకుని జనంలోకి వెళుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో నూటికి నూరు శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని కూడా ఏజీపీ ప్రచార కార్యదర్శి మనోజ్ సైకియా డిమాండ్ చేస్తున్నారు. అలాగే, అస్సాంలో ఎన్నికల సందర్భంగా వేర్పాటు నినాదాలూ బలంగానే వినిపిస్తున్నాయి.
బీహార్ - ప్రత్యేక హోదా..
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదానే ప్రచారాస్త్రంగా చేసుకున్నారు. వెనుకబాటుతనాన్ని అధిగమించాలంటే, రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ, ప్రత్యేక హోదా సాధించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన ఓటర్లకు చెబుతున్నారు. గడచిన తొమ్మిదేళ్ల కాలంలో తన ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని కూడా ఓటర్లకు గుర్తు చేస్తున్నారు. దాణా కేసులో దోషిగా తేలిన ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ సైతం ఈ ఎన్నికల్లో ‘అభివృద్ధి’ మంత్రంతోనే ఓటర్లను ఆకట్టుకునే యత్నం చేస్తున్నారు. బీహార్‌కు యూపీఏ సర్కారు ఉదారంగా నిధులు విడుదల చేయడం వల్లే అభివృద్ధి సాధ్యమైందంటూ కాంగ్రెస్ ఊదరగొడుతోంది. అధికారంలోకి వస్తే, బీహార్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అయితే, బీజేపీ మేనిఫెస్టోను నితీశ్ ఒక ప్రహసనంగా కొట్టి పారేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్- కులాలు మతాలు..
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ఏ పార్టీ గెలుపొందాలన్నా కుల మతాలనే నమ్ముకోక గత్యంతరం లేని పరిస్థితి. వారణాసి నుంచి తలపడుతున్న తమ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రభావంతో హిందువుల ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టగలమని బీజేపీ ఆశిస్తుంటే, మైనారిటీల ఓట్లపై కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంటోంది. ముస్లింల ఓట్లన్నీ కాంగ్రెస్‌కు పడేలా చూడాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇటీవల జామా మసీదు ఇమామ్ బుఖారీని స్వయంగా కలుసుకుని మరీ విజ్ఞప్తి చేశారు.
అవినీతి కంటే లౌకికవాదానికి వాటిల్లబోయే ముప్పే ప్రధాన సమస్య అని, అందుకే కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నామని బుఖారీ ప్రకటించారు. ఎస్పీ, బీఎస్పీలు సైతం లౌకికవాదానికి బాసటగా తమకు ఓటు వేయాలని కోరుతున్నాయి. మరోవైపు, జాట్ కులస్తులను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసి మోడీ అనుచరుడు అమిత్ షా ఎన్నికల కమిషన్ ఆగ్రహాన్ని చవిచూశారు. కాగా, యూపీ పశ్చిమ ప్రాంతంలోని 26 జిల్లాలతో ‘హరితప్రదేశ్’ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆరెల్డీ అధినేత అజిత్ సింగ్ డిమాండ్ చేస్తున్నారు.
తమిళనాడు- శ్రీలంక తమిళులు..
తమిళనాడులోని నాలుగు ప్రధాన రాజకీయ పార్టీల్లో మూడు శ్రీలంక తమిళుల సమస్యనే ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకున్నాయి. శ్రీలంక యుద్ధనేరాలను ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో అమెరికా మద్దతుతో ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ గైర్హాజరవడాన్ని తమిళనాడు సీఎం జయలలిత తీవ్రంగా తప్పుపడుతున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే కూడా యూపీఏ వైఖరిని దుయ్యబట్టింది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌తో పొత్తు ఉండబోదని డీఎంకే అధినేత కరుణానిధి కుమారుడు స్టాలిన్ స్పష్టం చేశారు. తమిళుల మనోభావాలను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తోందని బీజేపీ సైతం విమర్శలు గుప్పిస్తోంది. ఇక ఒకే ఒక్క సీటున్న కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ‘ప్రత్యేక రాష్ట్ర హోదా’ అన్ని పార్టీలకు ప్రచారాస్త్రంగా మారింది. ఏఐఏడీఎంకే, డీఎంకే, ఏఐఎన్‌ఆర్‌సీ, సీపీఐ తదితర పార్టీలు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఓట్లడుగుతున్నాయి.
జమ్మూకాశ్మీర్ అభివృద్ధి జపం..
జమ్మూ కాశ్మీర్‌లో చిరకాలంగా పరిష్కారం కాని సమస్యలు చాలానే ఉన్నా, ప్రస్తుత ఎన్నికల్లో అన్ని పార్టీలూ ‘అభివృద్ధి’ మంత్రంతోనే ఓటర్లను ఆకట్టుకునే యత్నాలు చేస్తున్నాయి. ప్రధాన పార్టీలైన ఎన్‌సీ-కాంగ్రెస్ కూటమి, బీజేపీ, పీడీపీ... ఈ మేరకు ఓటర్లకు హామీని స్తున్నాయి. మోడీ ప్రభావంతో బీజేపీ కాస్త బలం పుంజు కున్నా, ఎన్‌సీ-కాంగ్రెస్ కూట మిని అధిగమించే సూచనలైతే కనిపించడం లేదు. పీడీపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. మోడీకి మద్దతుపై ప్రస్తుతానికి తటపటాయిస్తున్నా, ఎన్నికల తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశాలు లేకపోలేదు. వాజ్‌పేయి పాలనను స్వర్ణయుగంగా పీడీపీ అధినేత ముఫ్తీ మహ్మద్ సయీద్ అభివర్ణిస్తుండటమే దీనికి సూచన. నిర్ణయాత్మకమైన స్థానాల్లో తమను గెలిపిస్తే, ‘కాశ్మీర్’ సమస్యను 3 నెలల్లోగా పరిష్కరిస్తామని కూడా ఆయన హామీ ఇస్తున్నారు. కాశ్మీర్‌లో ఈసారి మతం ప్రస్తావన పెద్దగా వినిపించకపోవడం విశేషం.
మధ్యప్రదేశ్ అవినీతి.. అరాచకం.. అభివృద్ధి..
మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సాధించిన ‘అభివృద్ధి’ని బీజేపీ ఎన్నికల ప్రచారాస్త్రంగా వాడుకుంటుండగా, గనుల అక్రమ తవ్వకాలు, కేంద్ర పథకాల అమలులో చోటు చేసుకున్న అవినీతిని, మావోయిస్టుల అరాచకాన్ని అదుపు చేయడంలో చౌహాన్ సర్కారు వైఫల్యాన్ని కాంగ్రెస్ ఎండగడుతోంది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన మావోయిస్టుల దాడిలో సీనియర్ నేతలను కోల్పోయిన కాంగ్రెస్, సానుభూతిని సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ, విజయోత్సాహంతో లోక్‌సభ ఎన్నికల్లోనూ ఫలితాలు తమకే అనుకూలిస్తాయన్న నమ్మకంతో ఉంది. అందుకు మోడీ ప్రభావం కూడా దోహదపడగలదనే ధీమా కూడా వ్యక్తం చేస్తోంది.
రాజస్థాన్ కాషాయం.. గోసంరక్షణ
గత ఏడాది రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన బీజేపీ రెట్టించిన ఉత్సాహంతో ఉంది. కాంగ్రెస్ సర్కారుకు నేతృత్వం వహించిన అశోక్ గెహ్లాట్ అభివృద్ధి మంత్రం అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేయకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు డీలాపడ్డాయి. ఒకవైపు కాంగ్రెస్ అభివృద్ధి, లౌకికవాదాలను ప్రచారాస్త్రాలుగా చేసుకోగా, బీజేపీ ఈసారి గోసంరక్షణను ప్రధాన ప్రచారాస్త్రంగా జనం ముందుకు వెళుతోంది. గోసంరక్షణకు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తోంది. రాజస్థాన్‌తో పాటు హర్యానా, యూపీ పశ్చిమ ప్రాంతంలోనూ దీన్నే ఎన్నికల ప్రచారాస్త్రంగా చేసుకుంటామని రాజస్థాన్ పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రభులాల్ సైనీ చెబుతున్నారు. యూపీఏ సర్కారు పెద్ద ఎత్తున మాంసం ఎ గుమతులకు అనుమతులు ఇస్తోందని బీజేపీ విమర్శిస్తోంది.
జార్ఖండ్ లౌకికవాదం, అభివృద్ధి
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో అభివృద్ధి, లౌకికవాదాలే జార్ఖండ్‌లో కీలకాంశాలుగా మారాయి. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీలు ఈ అంశాలనే ప్రధాన ప్రచారాస్త్రాలుగా మార్చుకున్నాయి. జేఎంఎం-కాంగ్రెస్‌లు ఏకమై బీజేపీని నిలువరించేందుకు లౌకికవాదాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. మావోయిస్టుల ప్రాబల్యం గణనీయంగా గల జార్ఖండ్‌లో శాంతిభద్రతలు కీలక సమస్యే అయినా, ప్రధాన పార్టీలేవీ ఆ విషయానికి పెద్దగా ప్రాధాన్యమివ్వడం లేదు. జేఎంఎం-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం అవినీతిమయమైందని విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ, లోక్‌సభ ఎన్నికల తర్వాత ఓట్ల లెక్కింపు పూర్తికాక ముందే జార్ఖండ్‌లో ప్రభుత్వం కుప్పకూలిపోతుందని జోస్యం చెబుతోంది.
పశ్చిమ బెంగాల్ లెఫ్ట్ అండ్ రైట్
ఒకప్పటి ‘ఎర్ర’కోటలో సమస్యలు లేకపోలేదు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం రాష్ట్రంలో నెలకొన్న సమస్యల కంటే నేతల నడుమ పరస్పర విమర్శలే హోరెత్తిస్తున్నాయి. గత వైభవం కోసం వామపక్షాలు పాకులాడుతుండగా, మోడీ ప్రభావంతోనైనా బెంగాల్‌లో కాషాయ జెండాను రెపరెపలాడించాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. యూపీఏతో తెగతెంపులు చేసుకున్న ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ ఇటు వామపక్షాలపైనా, అటు బీజేపీపైనా తనదైన శైలిలో విమర్శలు సంధిస్తున్నారు. బీజేపీ ‘మతతత్వ’ రాజకీయాలను ఎండగడుతున్నారు. బరిలో ఒంటరిగా మిగిలిన కాంగ్రెస్ ఉనికి నిలుపుకొనే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. బెంగాల్‌పై మోడీ ప్రభావం చూపగలిగితే, వామపక్షాలు తిరిగి బలం పుంజుకోగలవని భావిస్తున్నారు. అయితే, తృణమూల్ అత్యధిక స్థానాలను గెలుచుకుని, జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్‌ల తర్వాత మూడో పెద్ద పార్టీ అవ్వొచ్చని సర్వేలు చెబుతున్నాయి.
మహారాష్ట్ర రైతుల ఆత్మహత్యలు
మహారాష్ట్రలో కొన్నేళ్లుగా సాగుతున్న రైతుల ఆత్మహత్యల పరంపరకు కేంద్రంలోను, రాష్ట్రంలోను అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీలే కారణమని బీజేపీ దుయ్యబడుతోంది. కేంద్ర వ్యవసాయ మంత్రిగా ఉన్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా నిర్లక్ష్యం కారణంగానే రైతులకు ఇలాంటి దుస్థితి వాటిల్లిందని పలు ఎన్నికల సభల్లో మోడీ విమర్శించారు. ఎంఎన్‌ఎస్ అధినేత రాజ్ ఠాక్రే సైతం రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్, ఎన్సీపీలే బాధ్యత వహించాలంటూ విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్-ఎన్సీపీలకు ఓటు వేయవద్దంటూ ఒక రైతు రాసిపెట్టిన సూసైడ్ నోట్‌ను ఆయన ఎన్నికల ప్రచార సభల్లో చదివి వినిపిస్తున్నారు. అయితే, రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నది తమ ప్రభుత్వమేనని సోనియా చెప్పుకుంటున్నారు.
ఛత్తీస్‌గఢ్ మావోయిస్టులు
ఛత్తీస్‌గఢ్‌లో ప్రతి ఎన్నికల్లోనూ మావోయిస్టులే అసలు సమస్య. ఎన్నికల బహిష్కరణకు పిలుపునివ్వడం, ఎన్నికలకు ముందు దాడులు జరపడం ఈ రాష్ట్రంలోని మావోయిస్టులకు మామూలే. మావోయిస్టుల సమస్యకు సంబంధించి అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పరస్పర విమర్శలు గుప్పించుకుంటున్నాయి. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకున్న విజయోత్సాహం బీజేపీకి సానుకూలాంశం కాగా, రాష్ట్రంలో తిరిగి పట్టు సాధించుకోవడం కాంగ్రెస్‌కు విషమ పరీక్షే. అయితే, ముఖ్యమంత్రి రమణ్ సింగ్ సర్కారు సామాన్యులకు ఒరగబెట్టిందేమీ లేదని, ముఖ్యంగా గిరిజనులను పూర్తిగా గాలికొదిలేసిందని కాంగ్రెస్ విమర్శలు కురిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గిరిజన ప్రాంతాల్లో వెనుకబడటాన్ని గుర్తుచేస్తోంది.