
బయట ఉమ్మేస్తే రూ.1000 జరిమానా!
బిల్లు ప్రవేశపెట్టనున్న మహారాష్ట్ర ప్రభుత్వం
ముంబై: క్షయ తదితర అంటువ్యాధుల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడాన్ని నిషేధించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించిన బిల్లును వచ్చే నెల మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల్లో తేనుంది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడం, పొగాకు నమలడాన్ని నిషేధించాలని రాష్ట్ర ఆరోగ్యమంత్రి దీపక్ సావంత్ గత ఏడాది ప్రతిపాదించారు.
నిషేధాన్ని ఉల్లంఘించేవారికి భారీ జరిమానాతోపాటు బహిరంగ ప్రదేశాలను శుభ్రం చే యడం వంటివి చేయించాలని యోచిస్తున్నామని ఆయన తెలిపారు. బిల్లు ప్రకారం.. బహిరంగ ప్రదేశాల్లో తొలిసారి ఉమ్మితే రూ.1000 జరిమానా చె ల్లించి, ఒక రోజు సామాజికసేవ చేయాల్సి ఉంటుంది. రెండోసారి ఆ నేరానికి పాల్పడితే రూ. 3 వేల జరిమానా చెల్లించి, 3 రోజుల సామాజిక సేవ చేయాలి. పలుమార్లు ఈ నేరానికి పాల్పడితే రూ. 5వేల జరిమానా చెల్లించి, 5 రోజుల సామాజిక సేవ చేయాలి.