మిన్ను విరిగిపడింది | The collapse of a 11-storey apartment in Chennai | Sakshi
Sakshi News home page

మిన్ను విరిగిపడింది

Published Sun, Jun 29 2014 2:05 AM | Last Updated on Thu, Mar 21 2019 7:25 PM

మిన్ను విరిగిపడింది - Sakshi

మిన్ను విరిగిపడింది

పొట్ట కూటి కోసం చెన్నపట్నం వచ్చిన ఉత్తరాంధ్ర వలస కూలీలపై మిన్ను విరిగి పడింది. నిర్మాణంలో ఉన్న 11 అంతస్తుల భవనం శనివారం సాయంత్రం ఒక్కసారిగా కుప్పకూలి కార్మికులను కబళించింది. భవనం శిథిలాల్లో 50 నుంచి 60 మంది చిక్కుకుపోగా..

చెన్నైలో కుప్పకూలిన 11 అంతస్తుల అపార్ట్‌మెంట్
 
చెన్నై/విజయనగరం, సాక్షి: పొట్ట కూటి కోసం చెన్నపట్నం వచ్చిన ఉత్తరాంధ్ర వలస కూలీలపై మిన్ను విరిగి పడింది. నిర్మాణంలో ఉన్న 11 అంతస్తుల భవనం శనివారం సాయంత్రం ఒక్కసారిగా కుప్పకూలి కార్మికులను కబళించింది. భవనం శిథిలాల్లో 50 నుంచి 60 మంది చిక్కుకుపోగా.. విజయనగరం జిల్లాకు చెందిన 14 మంది చనిపోయినట్లు ఆ జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే ప్రకటించారు. శనివారం అర్థరాత్రి సమయానికి ఐదు మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో ఒకరిని విజయనగరం జిల్లా బాడంగి మండలానికి చెందిన బొంగు శాంతకుమారి (24)గా గుర్తించారు. మరో ఇద్దరిని మదురైకి చెందిన మరుదపాండి, శంకర్‌గా గుర్తించగా.. ఇంకా రెండు మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. శిథిలాల నుంచి మరో 16 మంది క్షతగాత్రులను ప్రాణాలతో రక్షించి రామచంద్ర మెడికల్ కాలేజ్‌కు తరలించారు. శిథిలాల కింద ఇంకా 40 మంది వరకూ చిక్కుకుపోయి ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన భవన నిర్మాణ కార్మికులే ఎక్కువ మంది ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తమవుతోంది. తమిళనాడు ప్రభుత్వ యంత్రాంగంతో పాటు.. అరక్కోణం నుంచి జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేసింది. భవనం కుప్పకూలిన ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించారు.

 చెన్నై నగరం సమీపంలోని పోరూరు వద్ద మౌళివాకం ప్రాంతంలో కొత్తగా నిర్మిస్తున్న 11 అంతస్తుల అపార్టుమెంటు భవనం ‘ట్రస్ట్ హైట్స్’ శనివారం సాయంత్రం ఒక్కసారిగా కుప్పకూలింది. అపార్ట్‌మెంట్ నిర్మాణ పనులు మొత్తం పూర్తికాకుండానే కొందరు ఈ భవనంలో నివసిస్తున్నారు. పెద్ద సంఖ్యలో కార్మికులు నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. శనివారం సాయంత్రం 5 గంటలకు వర్షంతో పాటు పిడుగులు పడ్డాయి. సరిగ్గా అదే సమయంలో పెద్ద శబ్దంతో ఈ అపార్టుమెంటు భవనం కూలిపోయింది. ఏం జరుగుతోందో తెలిసేలోగానే అందులో నివసిస్తున్న వారితో పాటు.. పనిచేస్తున్న కార్మికులందరూ శిథిలాల్లో కూరుకుపోయారు. కాంక్రీటు పలకలు, ఇనుపచువ్వల కింద చిక్కుకుపోయారు. ఈ ప్రమాదం ధాటికి ఒక వంట గ్యాస్ సిలిండర్ కూడా పేలిపోయింది. తమిళనాడు అధికార యంత్రాంగం సహాయ చర్యలు చేపట్టినప్పటికీ.. కొద్దిసేపటికే చిమ్మచీకట్లు అలుముకోవడంతో పనులు వేగంగా సాగలేదు. ఫ్లడ్ లైట్ల వెలుగులో పదికి పైగా అగ్నిమాపక శకటాలు, సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. సాయంత్రం 6:30 గంటలకు కందసామి అనే వ్యక్తిని శిథిలాల నుంచి స్వల్పగాయాలతో బయటకు తీశారు. రాత్రి 8.00 గంటలకు ఒక మృతదేహాన్ని కనుగొన్నారు. రాత్రి 10 గంటల సమయంలో విజయనగరం జిల్లాకు చెందిన శాంతకుమారి మృతదేహాన్ని వెలికితీశారు. ప్రాణాలతో బయటకు తీసిన 16 మంది క్షతగాత్రుల్లో బాడంగి గ్రామానికి చెందిన చిన్నా ఉన్నారు. శిథిలాల కింద ఇంకా 40 మంది వరకూ చిక్కుకుపోయి ఉన్నట్లు ఆయన చెప్పారు. అరక్కోణంలోని రాజాలీ నుంచి జాతీయ విపత్తుల నివారణ బృందం సిబ్బంది 260 మంది హుటాహుటిని సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. చెన్నై అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, నగర పాలక సంస్థ, రెవెన్యూ విభాగాలకు చెందిన సిబ్బంది సహాయ చర్యలు చేపడుతున్నారు.

శిథిలాల్లో చిక్కుకున్న వారి వివరాలు ఇవీ...

కార్మికుల బంధువులు తెలిపిన సమాచారం ప్రకారం.. విజయనగరం జిల్లా మక్కువ మండలం తూరుమామిడి గ్రామానికి చెందిన భార్యాభర్తలు సీర సత్యనారాయణ (52), సీర జయమ్మ (48)లతో పాటు చింతల తిరుపతిరావు (27); బాడంగి మండలానికి చెందిన భార్యాభర్తలు బొమ్మి గౌరునాయుడు (40), బొమ్మి అనసూయ (36); దత్తిరాజేరు మండలం కె.కృష్ణాపురం గ్రామానికి చెందిన భార్యాభర్తలు కర్రి అప్పలనాయుడు, కర్రి తవుడమ్మ (35)లతో పాటు మంత్రి మీనమ్మ (35), పతివాడ బంగారునాయుడు (30), పతివాడ గౌరీశ్వరి (28), తేజేటి అప్పలరాము (40), తేజేటి లక్ష్మి (35), సిరిపురపు రాము (30), వనుము దుర్గ (18); శ్రీకాకుళం జిల్లా ఎల్.ఎన్.పేట మండలానికి చెందిన దుక్క తౌడు (50); హిరమండలం మండలానికి చెందిన మీసాల శ్రీనివాసరావు (38), కూతురు భవాని, పెశైట్టి జ్యోతి (25), కొంగరాపు శ్రీను (40), ఆయన భార్య కృష్ణవేణి; కోటబొమ్మాళి మండలానికి చెందిన ఎముకల శ్రీను (33); నరసన్నపేట మండలం బాలసీమ గ్రామానికి చెందిన డి.పద్మ (35); కొత్తూరు మండలం కర్లెమ్మ గ్రామానికి చెందిన భార్యాభర్తలు దాసరి రాము (40), కళావతి (37)లు శిథిలాల్లో చిక్కుకుపోయారు. వెల్లంపట్టి మండలం ధనికోడు గ్రామానికి చెందిన రామారావు, కనకమ్మ సంఘటన స్థలంలో ఉన్నారు. ఈ కుటుంబం నుంచి 10 మంది చెన్నై నగరానికి రాగా.. వీరిద్దరు మాత్రం తాంబరంలో పని చేస్తున్నారు. మిగిలిన ఎనిమిది మంది కూలిన భవనం శిథిలాల్లో చిక్కుకున్నారు. చిక్కుకుపోయిన వారిలో ఎక్కువమంది చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే చనిపోయిన వారి వివరాలు పూర్తిగా తెలియరావటం లేదు.

విజయనగరం జిల్లా వాసులు 14 మంది మృతి: కాంతిలాల్

చెన్నై నగరంలోని 11 అంతస్తుల భవనం కూలిపోయిన ఘటనలో విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కె.కృష్ణాపురానికి చెందిన ఎనిమిది మంది, మక్కువ మండలం తూరుమామిడికి చెందిన ముగ్గురు మృతి చెందినట్టు జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే శనివారం రాత్రి ప్రకటించారు. మరో ముగ్గురు కూడా మృతి చెందారని అయితే వారి సమాచారం స్పష్టంగా తెలియదని ఆయన తెలిపారు. మృతదేహాలను గుర్తించి, పోస్టుమార్టం నిర్వహించి, స్వస్థలాలకు పంపేందుకు జిల్లా నుంచి ఆర్‌డీఓ, ఏపీఎంఐపీ పీడీ, కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్‌లను కలెక్టర్ చెన్నై పంపించారు. సంఘటన స్థలంలో చిక్కుకున్న వారి వివరాల కోసం ఆర్‌డీఓ  9491012021, డీఆర్‌ఓ 9491012012లను సంప్రదించాలన్నారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ 08922-236947 నంబరుకు కాల్ చేసి  పరిస్థితిని తెలుసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.

పిడుగు వల్లే కూలింది: నిర్మాణ సంస్థ

గతంలో పోరూరు నదీ ప్రాంతంలో అపార్టుమెంటును నిర్మించడం, భవనం పునాదులు బలహీనంగా ఉండడం ప్రమాదానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. అయితే.. కుప్పకూలిన భవనాన్ని అన్నిరకాల నియమ నిబంధనలకు లోబడి నిర్మించామని, నాణ్యతలో నిర్లక్ష్యం చేయలేదని అపార్ట్‌మెంట్ నిర్మాణ సంస్థ ‘ప్రైమ్ సృష్టి’ డెరైక్టర్ బాలగురు పేర్కొన్నారు. వర్షంతో పాటు పిడుగు పడడం వల్లనే 11 అంతస్తుల భవనం రెండుగా చీలి కూలిపోయిందన్నారు. శనివారం వేతనాలు ఇచ్చే రోజని, పెద్దగా సిబ్బంది విధుల్లో లేరని.. వర్షం వల్ల  20 నుంచి 30 మంది అక్కడ ఉండి ఉండవచ్చన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల భవనం కూలిపోయిందని.. దీనికి తామెలా బాధ్యత వహించగలమని వ్యాఖ్యానించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement