
17 రోజులు... రూ.16 కోట్లు
విజయనగరం మున్సిపాలిటీ : జిల్లాలో భారీ, మధ్య తరహా పరిశ్రమలు 35, చిన్నతరహా పరిశ్రమలు సుమారు మూడు వేలవరకు ఉన్నాయి. వీటిలో వేలాది మంది కార్మికులు ప్రతక్ష్యంగా, పరోక్షంగా ఉపాధి పొందుతూ బతుకుబండిని లాగిస్తున్నారు. పరిశ్రమల వారీగా చూసుకుంటే ఫార్మాకంపెనీల్లో మూడు వేల మంది, ఫెర్రో అల్లాయీస్ పరిశ్రమల్లో 10 వేల మంది, ఏపీఐఐసీలో మూడు వేల మంది, ఇతర చిన్న పరిశ్రమల్లో మరో 20 వేల మంది వరకు ఉపాధి పొందుతున్నారు. ఒకటి రెండు ఫార్మాకంపెనీలు, జన రేటర్ సదుపాయం ఉన్న పెద్ద పరిశ్రమలు తప్ప మిగతా పరిశ్రమలు హుదూద్ తుపాను దెబ్బతో మూతపడ్డాయి.
దీంతో ఆయా పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల బతుకులు వీధిన పడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆయా పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులు, ఉద్యోగులు ఏ పనిలేకుండా ఖాళీగా కూర్చుంటున్నారు. పనిచేస్తేనే వీరికి కూలి లభిస్తుంది. పనిలేకపోతే పస్తులుండవలసిందే. ఒక్కొక్క కార్మికునికి రోజు కూలి సుమారు రూ.250 అయితే. ఈ 17 రోజులకు దాదాపు 36 వేల మంది కార్మికులు సుమారు రూ.16 కోట్లు నష్టపోయారు. విద్యుత్ సరఫరాను గృహవసరాల మేరకు పునరుద్ధరించిన అధికారులు ఈ నెలాఖరులోగా పరిశ్రమలకు ఇచ్చేందుకు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం పరిశ్రమల్లో విద్యుత్ దీపాల వెలుగులకు మాత్రమే అధికారులు అనుమతించారు. ఎప్పుడు విద్యుత్ సరఫరా జరుగుతుందో, తమకు పని ఎప్పుడు దొరుకుతుందోనని కార్మికులు ఎదు రు చూస్తున్నారు. వేరే పనులకు వెళ్ల లేక, నమ్ముకున్న పరిశ్రమ ఎప్పుడు తెరుస్తారో తెలియక ఆందోళనలో సతమతమవుతున్నారు.
సోమవారం నుంచి పరిశ్రమలకు విద్యుత్ సరఫరా చేస్తామని కలెక్టర్ ముధావత్ ఎం నాయక్ ప్రకటించినా అది అమలుకు నోచుకోలేదు. 320 కేవీ లైన్‌ల ద్వారా విద్యుత్ సరఫరా అయ్యే పెద్ద టవర్స్ కూలిపోయాయని, వాటిని పునరురుద్ధరించే పనులు జరుగుతున్నాయని, అందువల్ల ఇప్పట్లో పరిశ్రమలకు సరఫరా ఇవ్వలేమని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. పరిశ్రమలకు పూర్తిస్తాయిలో విద్యుత్ సరఫరాకు మరో వారం రోజులు పడుతుందని సమాచారం. ఈ లెక్కన కార్మికుల కుటుం బాలు ఈ వారం రోజులూ అర్ధాకలితో అలమటించవలసిందే .