
‘మార్చి 11న వారి పాలనకు శుభంకార్డే’
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యే మార్చి 11న సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ వంశపరిపాలనకు శుభం కార్డు పడుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా జోస్యం చెప్పారు. శుక్రవారం ఎతవాహ్‌లో జరిగిన ఎన్నికల ప్రచారసభలో ఆయన మాట్లాడుతూ పరిపాలన చేపట్టి ఏడాదిలోనే తాము యూపీని నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ఎస్పీ, బీఎస్పీ విఫలమయ్యాయని ఆరోపించారు.
రాకుమారులు(అఖిలేశ్, రాహుల్ గాంధీ) అన్ని తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారని, ఇప్పటికే యూపీలో సర్వం దోచారని, ప్రతి రంగంలో అవినీతి పేరుకుపోయిందని మండిపడ్డారు. ఉత్తరభారతంలో హత్యలు ఎక్కువగా జరిగే రాష్ట్రం యూపీనే అని, శాంతిభద్రతలు పూర్తిగా ఇక్కడ నశించాయని, ఒకే వంశ పాలనకు త్వరలోనే ముగింపు రానుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారం వస్తుందనే నమ్మకం లేకనే కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకున్నారని, ప్రజలు ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. తాము అధికారంలోకి వస్తే రైతులనుంచి నేరుగా విత్తనాలు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.