
మోకాళ్లతో ఒత్తిపట్టి మెడపై కూర్చొని..
లక్నో: ఉత్తరప్రదేశ్ పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. దొంగగా అనుమానించి ఓ యువకుడిని గొడ్డునిబాదినట్లు బాదారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఫలితంగా పోలీసులు వ్యవహరించిన తీరుపట్ల పోలీసు ఉన్నతాధికారులు కూడా విస్మయం వ్యక్తం చేయడంతోపాటు మానవ హక్కుల కార్యకర్తలు మండిపడుతున్నారు. పోలీసుల వివరాల ప్రకారం దొంగతనానికి పాల్పడినట్లు అనుమానించి ఓ యువకుడిని ఎత్వాహ్ పోలీసులు అరెస్టు చేశారు.
అనంతరం విచారణ గదికి తీసుకెళ్లి టేబుల్ పై పడుకోబెట్టి ఆ యువకుడి తలను కదలకుండా ఓ పోలీసు మొకాళ్లతో ఒత్తిపట్టి మెడపై కూర్చుని ఉంచగా.. మరోపోలీసు అతడి కాళ్లను గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడే ఓ దండనాయకుడి మాదిరిగా సివిల్ డ్రస్ లోఉండి బారెడు పొట్ట వేసుకున్న ఓ పోలీసు వచ్చాడు. చేతిలో బ్యాటులాంటిదానిని తీసుకున్నాడు. దానికి ఒక మందమైన రబ్బరు కూడా ఉంది. ఇక ఆ కుర్రాడు లబోదిబోమంటు కేకలు వేస్తున్నా దెబ్బమీదదెబ్బలతో ఫటాఫటా వాయించారు. ఆ వీడియో చూస్తే ఒళ్లు ఝల్లుమనడం మాత్రం ఖాయం.